వెలుగుల రేడు
వెండి రథంపై
● సప్త వాహనాలపై దర్శనమిచ్చిన చెన్నకేశవుడు ● వైభవంగా రథసప్తమి వేడుకలు ● వేలాదిగా హాజరై స్వామివారిని దర్శించుకున్న భక్తులు
మార్కాపురం టౌన్: రథసప్తమిని పురస్కరించుకుని మార్కాపురంలోని ప్రసిద్ధ శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారు వెండి రథంపై ఆదివారం భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణంలోని నాలుగు మాడవీధుల్లో స్వామి వారు సప్త వాహనాల్లో వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల తరహాలో రఽథసప్తమి వేడుకలు జరగటంతో వేలాదిగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనం నుంచి శేష, గరుడ, హనుమంత వాహనం, కల్పవృక్ష వాహనంపై చెన్నకేశవ స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం స్వామి వారికి చక్రస్నానాన్ని అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు, నంద్యాల శ్రీనివాసచార్యులు, వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాత్రి ఏడు గంటలకు వెండితో తయారు చేసిన భారీ రథంపై చెన్నకేశవ స్వామివారికి నగరోత్సవం నిర్వహించారు. అనంతరం చంద్రప్రభ వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ జీ.శ్రీనివాసరెడ్డి, ఉత్సవ సేవా సంఘం అధ్యక్షుడు యక్కలి కాశీవిశ్వనాథం, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ అన్నా రాంబాబు, కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల సెక్రటరీ అన్నా కృష్ణ చైతన్య, మాజీ ధర్మకర్తలు, ఉత్సవ సేవా సంఘం సభ్యులు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. భద్రత ఏర్పాట్లను ఇన్‌చార్జ్ కలెక్టర్ రాజాబాబు, జేసీ పి.శ్రీనివాసులు, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, డీఎస్పీ నాగరాజు, సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో సబ్ డివిజన్‌లోని ఎస్సైలు, పోలీసులు, సహాయ కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కోలాటం, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ వేషాలతో నృత్యాలు అలరించాయి.


