బీమా.. లేదు ధీమా..! | - | Sakshi
Sakshi News home page

బీమా.. లేదు ధీమా..!

Jan 26 2026 4:10 AM | Updated on Jan 26 2026 4:10 AM

బీమా.. లేదు ధీమా..!

బీమా.. లేదు ధీమా..!

బీమా.. లేదు ధీమా..!

బేస్తవారిపేట:

ప్రమాదాలు, సహజ మరణాల్లో కుటుంబ పెద్దను కోల్పోయిన పేదలకు అండగా ఉండే బీమా పథకం అమలుపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నప్పటికీ ఈ బీమా పథకం అమలుపై ఎటువంటి ప్రకటనా చేయలేదు. రేషన్‌ కార్డు ఉన్న కుటుంబ పెద్ద ఆకస్మిక, సహజ మరణం పొందినప్పుడు ఆ కుటుంబానికి ఆర్థిక ఉపశమనం కలిగించడం కోసం గతంలో ప్రభుత్వం ఈ బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. గత ఎన్నికల్లో గెలుపు కోసం కూటమి నాయకులు అనేక హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చాక పేదలకు మేలు చేసే పథకాలను నిర్వీర్యం చేశారు. కనీసం బీమా పథకమైనా అమలు చేస్తే కాస్త భరోసా ఉంటుందని పేద ప్రజలు ఎదురుచూస్తున్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన వైఎస్సార్‌ బీమా పథకం పేరును చంద్రన్న బీమాగా మార్చిన కూటమి ప్రభుత్వం.. అమలును మాత్రం గాలికొదిలేసింది. దీంతో సహజ మరణంతో పాటు ప్రమాదవశాత్తూ కుటుంబ పెద్ద మరణించిన కుటుంబాలు రెండేళ్లుగా పరిహారం కోసం ఎదురుచూస్తున్నాయి. అసలు ఈ బీమా పథకం అమలు జరుగుతుందా.. లేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మార్కాపురం జిల్లాలో

3,23,111 రేషన్‌కార్డులు...

నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 3,23,111 తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. వీరంతా దారిద్య్రరేఖకు దిగువనున్నవారే. అంత్యోదయ, తెల్ల రేషన్‌ కార్డులు కలిగిన వారంతా చంద్రన్న బీమా పథకానికి అర్హులు. ప్రమాదవశాత్తూ ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరిని మృత్యువు వెంటాడుతూనే ఉంటుంది. ప్రతి ఏడాది 800 నుంచి 1000 సహజ మరణాలతో పాటు దాదాపు 200 మంది ప్రమాదాల్లో ప్రాణాలు విడుస్తున్నట్లు సమాచారం. వివిధ ప్రమాదాల వల్ల వందల మంది వైకల్యం బారిన పడి మంచాల్లో మగ్గుతున్నారు. బీమా లేకపోవడంతో బాధిత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఇలాంటి వారికి బీమా అమలు చేస్తే ఎంతో ఉపశమనం కలిగేదని బాధిత కుటుంబాలు పేర్కొంటున్నాయి.

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో

పక్కాగా అమలు...

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్‌ బీమా పథకాన్ని పక్కాగా అమలు చేశారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి పేదోడికి ఆనాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేయూతనందించారు. అధికారులు నేరుగా బాధితుల వద్దకే వెళ్లి బీమా నగదు అందించారు. సవ్యంగా సాగుతున్న ఈ పథకానికి సార్వత్రిక ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రహణం పట్టింది.

రూ.10 లక్షల హామీ ఎమైంది..?

కూటమి సర్కారు బీమా పథకం నగదును గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఇచ్చినదానికి రెట్టింపు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీలు గుప్పించింది. సహజ మరణానికై తే రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.10 లక్షలు ఇస్తామంటూ కూటమి నాయకులు ఎన్నికలప్పుడు ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ ముద్రించి ఇంటింటికి పంచారు. అధికారం చేపట్టాక ఎప్పటిలాగే చంద్రబాబు మర్చిపోయారు. 2024 మే 13 నుంచి బీమా పథకం వివరాలను వెబ్‌సైట్‌ నుంచి తొలగించారు. ఆ తర్వాత నమోదు చేసేందుకు అవకాశం కల్పించలేదు. అప్పటి నుంచి ఎన్నో బాధిత కుటుంబాలు రోడ్డునపడి బీమా నగదు కోసం ఎదురుచూపులు చూస్తున్నాయి.

టీడీపీ, జనసేన సభ్యత్వాలు ఉంటేనే బీమా అంటూ ప్రచారం...

పేద ప్రజలందరికీ బీమా అందించేందుకు చంద్రబాబు ప్రభుత్వానికి మనసు రావడంలేదు. టీడీపీ, జనసేన పార్టీల సభ్యత్వాలు తీసుకుంటేనే ఇన్సూరెన్స్‌ వర్తిస్తుందంటూ ప్రచారం చేస్తున్నారు. పార్టీ సభ్యత్వాలు తీసుకున్నవారికే ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పిస్తూ పేద ప్రజలను పక్కన పెట్టేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కార్మికుడు అల్లాబకాష్‌

రేషన్‌కార్డు లబ్ధిదారులకు వర్తించని చంద్రన్న బీమా

కుటుంబ పెద్దను కోల్పోతే పరిహారం శూన్యం

చంద్రన్న బీమాపై స్పష్టత ఇవ్వని కూటమి సర్కారు

2024 మార్చి తర్వాత అమల్లో లేని పథకం

ఎన్నికల మేనిఫెస్టోకి మాత్రమే పరిమితం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement