అదుపుతప్పి కారు బోల్తా
● నలుగురికి తీవ్ర గాయాలు
కురిచేడు(దొనకొండ):
పందిని తప్పించే క్రమంలో అదుపుతప్పి కారు బోల్తా పడింది. ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని బోదనంపాడు వద్ద ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన వారు వెలిగండ్ల మండలం రాళ్లపల్లి దగ్గర గుంటెయ్య స్వామి ఆలయంలో మొక్కులు తీర్చుకునేందుకు కారు, మరో వాహనంలో వెళుతున్నారు. వీరి వాహనం బోదనంపాడు కొండ వద్దకు రాగానే అడవి పంది అడ్డు రావడంతో తప్పించే క్రమంలో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గోతిలో బోల్తా పడింది. ప్రమాదంలో తెల్లగండ్ల గురవమ్మ, మగటి పద్మ, ఎగటి లక్ష్మమ్మ, డేగా వెంకటరమణమ్మ, చిన్నబాబు గోపీలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో పైలట్ వెంకటప్పయ్య, ఈఎంటీ యోహాను ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం నరసరావుకు తరలించారు. వీరు నకరిల్లు మండలం నరసింగపాడు గ్రామానికి చెందిన వారు కాగా ఉపాధి రిత్యా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.


