బస్సు ఢీకొని భర్త మృతి, భార్యకు గాయాలు
అద్దంకి రూరల్: స్కూటీపై వెళ్తున్న భార్యాభర్తలను ఎదురుగా వచ్చిన స్కూల్ బస్సు ఢీకొట్టడంతో భర్త మృతిచెందగా, భార్యకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన అద్దంకి మండలంలోని దర్శి రోడ్డులో శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ సుబ్బరాజు తెలిపిన వివరాల మేరకు.. ముండ్లమూరు మండలంలోని ఉల్లగల్లుకు చెందిన తప్పెట చిన్న (40), అతని భార్య రాజమ్మ ఒంగోలులో నివాసం ఉంటున్నారు. శుక్రవారం స్కూటీపై ఉల్లగల్లు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా మార్గం మధ్యలో అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం సమీపంలో ఇటుక బట్టీల వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ప్రైవేటు స్కూల్ బస్సు ఢీకొట్టింది. దీంతో స్కూటీపై ఉన్న తప్పెట చిన్న అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య రాజమ్మకు తీవ్రగాయాలవడంతో 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
టంగుటూరు: మద్యం మత్తులో వ్యక్తిపై దాడి చేసిన సంఘటన మండలంలోని కొణిజేడు గ్రామ శివారులో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొణిజేడు గ్రామానికి చెందిన రామా రవి, బాలినేని బాలిరెడ్డి స్నేహితులు కాగా, ఇద్దరూ గురువారం రాత్రి 10 గంటలకు ఊరి చివర పొగాకు బ్యారన్ల వద్ద మందు తాగారు. రామా రవి మందుకి డబ్బులు అడగ్గా.. బాలిరెడ్డి డబ్బులు లేవన్నాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. రామా రవి అతని చేతిలో ఉన్న బీరు బాటిల్‌తో బాలినేని బాలిరెడ్డిపై దాడి చేశాడు. బాలిరెడ్డి చాతి పక్క, కుడి చేయి మణికట్టు వద్ద గాయమైంది. అనంతరం రవి వెళ్లిపోగా, మద్యం మత్తులో ఉన్న బాలిరెడ్డి తెల్లవారేంత వరకూ అక్కడే పడి ఉన్నాడు. దీంతో తీవ్ర రక్త స్రావమైంది. తెల్లవారుజామున రామా వెంకట్రావు అనే వ్యక్తి గమనించి ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు. బాలినేని బాలిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపారు.


