నైజీరియా..!
ఆహారం కోసం వెళ్తున్న పక్షులు
బల్లికురవ:
ఖండాంతరాలు దాటి వేల కిలోమీటర్లు నైజీరియా, కొరియా దేశాల నుంచి వచ్చే వైట్ స్ట్రోక్ పక్షుల రాక ఏటికేడు తగ్గుతోంది. సంక్రాంతి పండగకు కూతుళ్లు, అల్లుళ్లు వచ్చినట్లు శతాబ్ధాలుగా ఆడ,మగ పక్షులు గ్రామానికి వస్తూ సందడి చేస్తున్నాయి. చెట్లు అంతరించడంతో వలస పక్షుల సంఖ్య తగ్గుతోంది. పదేళ్ల క్రితం సుమారు 650 నుంచి 750 వరకు వచ్చిన పక్షులు గతేడాది 300 పడిపోయాయి. ఈ ఏడాది 250కి మించి రాలేదని గ్రామస్తులు ‘సాక్షి’కి తెలిపారు. గతేడాది ఇక్కడికి వచ్చిన పక్షులకు వసతులు లేనందున పక్కనే ఉన్న అద్దంకి మండలంలోని మైలవరం గ్రామానికి చేరాయి. ప్రకాశం, పల్నాడు జిల్లాల సరిహద్దులో ఉన్న బల్లికురవ మండలం వెలమవారిపాలెం గ్రామానికి పక్షుల రాక వందల ఏళ్ల క్రితమే ఆరంభమైంది. పక్కనే గుళ్లకమ్మ ఉండటంతో నీటికి, ఆహారానికి ఇబ్బందులు లేవు. గ్రామ పంచాయతీ నిధులతో కూకట్లపల్లి వెళ్లే రోడ్డులో పక్షులకు మంచినీటి కోసం చెరువు తవ్వించారు. గుడ్లు పెట్టి పిల్లలను చేసి తిరిగి స్వదేశానికి సుమారు 5 వేల కిలోమీటర్ల నుంచి జనవరి మొదటి రెండో వారంలో మగ, ఆడ పక్షులు ఇక్కడికి వస్తాయి. చెట్లపై గూళ్లు కట్టుకొని నివాసం ఉంటాయి. ఆడ పక్షి గుడ్లు పెట్టి పిల్లలను చేస్తుండగా మగ పక్షి కావలసిన ఆహారాన్ని సమీపంలోని చెరువుల వద్దకు వెళ్లి వేటాడి తెచ్చి పెడుతుంది. జనవరి నుంచి జూన్ వరకు ఆ దేశాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందువల్లే ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని పిల్లలకు రెక్కలు రాగానే జూలై మొదటి వారంలో స్వదేశానికి వెళ్తాయి. విదేశీ పక్షులను చూసేందుకు ఈ ఆరు మాసాలు జిల్లాతో పాటు సమీప జిల్లాల నుంచి సందర్శకులు గ్రామానికి వస్తుంటారు.
తగ్గుతున్న పక్షుల రాక
చెట్లు అంతరించటం.. వేటగాళ్లు పక్షులను పట్టుకోవడం వంటి చర్యలతో ఏటికేడు పక్షుల రాక తగ్గుతోందని, ఇదే పరిస్థితి కొనసాగితే అసలు అవి రావేమోనని, ఇది తమ గ్రామానికి ఏదైనా అరిష్టం జరుగుతుందేమోనని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. పక్షి రక్షణ చెట్ల పెంపకంతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని గ్రామస్తులు, పక్షుల ప్రేమికులు కోరుతున్నారు.
చెట్లు అంతరించడంతో తగ్గుతున్న విదేశీ పక్షులు
నైజీరియా, కొరియా దేశాల నుంచి వైట్ స్ట్రోక్ పక్షుల రాక
ఆతిథ్యమిచ్చిన వెలమవారిపాలెం గ్రామస్తులు
ఆరు నెలలపాటు ఆ గ్రామంలోనే మకాం
కంటికి రెప్పలా కాపాడుతున్న గ్రామస్తులు
చెట్ల్లు పెంచి పర్యాటక కేంద్రంగా మార్చాలని విజ్ఞప్తి


