నిందితులను కఠినంగా శిక్షించాలి
● మార్కాపురంలో రజకుల ర్యాలీ
మార్కాపురం: పామూరు మండలం బొడ్లగూడూరు గ్రామంలో రజకుడు చీమలదిన్నె మహర్షిపై దాడిచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ గురువారం సాయంత్రం మార్కాపురం పట్టణంలో రజకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీసులకు వినతిపత్రం అందించారు. ఆటో డ్రైవర్ మహర్షి నిమ్మకాయల లోడుతో వెళ్తున్న ఆటోలో నుంచి బస్తా మోటారు సైకిల్‌పై పోతున్న వారికి తగిలిందని, దీంతో సదరు వ్యక్తులు మహర్షిని స్తంభానికి కట్టేసి కొట్టడం దారుణమన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.
● కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు
కంభం: మతిస్థిమితం లేక రైల్లో నుంచి దిగి బయట తిరుగుతున్న ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు గురువారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్సై శివకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..గుర్తు తెలియని ఓ వ్యక్తి చేతిలో కర్రపట్టుకొని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని 112 ఎమర్జెన్సీ కాల్ సెంటర్‌కు ఫిర్యాదు అందింది. సదరు వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో విజయవాడకు చెందిన ఓ మహిళ తన భర్త తిమ్మసర్థి దుర్గాప్రసాద్ విజయవాడ నుంచి గోవా వెళ్తూ గురువారం రాత్రి కంభం రైల్వేస్టేషన్‌లో దిగి పారిపోయాడని తెలిపింది. తహసీల్దార్ కార్యాలయం పరిసరాల్లో తిరుగుతున్న వ్యక్తి అతనే అని నిర్థారించుకున్న పోలీసులు పరిసర ప్రాంతాల్లో సిబ్బంది, డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలు చేపట్టి గురువారం మధ్యాహ్నం అతని ఆచూకీ గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తన భర్తను క్షేమంగా అప్పగించిన పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సదరు వ్యక్తిని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి


