ఎస్పీ కార్యాలయ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన
మార్కాపురం: స్థానిక డీఎస్పీ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఎస్పీ కార్యాలయ పునరుద్ధరణ పనులకు గురువారం డీఎస్పీ డాక్టర్ నాగరాజు శంకుస్థాపన చేశారు. డీఎస్పీ కార్యాలయాన్ని 1911లో బ్రిటీష్ ప్రభుత్వం నిర్మించింది. 115 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన కార్యాలయంలో అప్పట్లోనే సిబ్బంది క్వార్టర్స్, సీఐ, ఎస్సై క్వార్టర్స్ పటిష్ట రక్షణ వ్యవస్థ, గార్డు రూమ్‌ను ఏర్పాటు చేశారు. పదేళ్ల నుంచి భవనాలు శిథిలమైపోవడంతో పలువురు పోలీసు అధికారులు బయట అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నారు. ఇటీవలే మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించడంతో ఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. దీంతో స్థానిక డీఎస్పీ కార్యాలయంలోనే ఎస్పీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకూ డీఎస్పీ ఉపయోగిస్తున్న కార్యాలయాన్ని ఎస్పీకి కేటాయించారు. దీంతో పాటు ఎస్‌బీ కార్యాలయం, ఇంటలిజెన్స్, డీసీఆర్‌బీ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. ఏపీఎస్‌పీ సిబ్బంది, ఎస్పీ సిబ్బంది, అదనపు ఎస్పీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా డీఎస్పీ కార్యాలయంలో ఉన్న చెట్లను తొలగించి ఆ ప్రాంతాన్ని చదును చేసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో పట్టణ ఎస్సై సైదుబాబు, కాంట్రాక్టర్ బి.వెంకటేశ్వరరెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
సింగరాయకొండ: బాలికపై దాడి ఘటనలో ఇద్దరు యువకులపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం రాత్రి పోక్సో కేసు నమోదయినట్లు ఎస్సై బి.మహేంద్ర తెలిపారు. మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో పాకల గ్రామానికి చెందిన బాలికపై సింగరాయకొండ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు వెంకట సాయికృష్ణ, సాథిక్‌లు దాడికి పాల్పడ్డారు. వీరి దాడిలో గాయపడిన బాలిక ఒంగోలు జీజీహెచ్‌లో చికిత్స పొందింది. ఆస్పత్రి నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేంద్ర వివరించారు.


