పరిహారానికీ మంగళం!
మోంథా తుఫాన్ ప్రభావంతో ప్రస్తుత మార్కాపురం జిల్లాలో భారీగా పంట నష్టం 19 మండలాల్లో 18800 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు రైతులకు దక్కాల్సిన నష్ట పరిహారం రూ.30.73 కోట్లు మూడు నెలలుగా 10,836 మంది రైతుల ఎదురుచూపులు రబీ ముగుస్తున్నా సాయమందకపోవడంతో రైతుల్లో నిరాశ
మార్కాపురం: అన్నదాతలపై ప్రకృతే కాదు.. చంద్రబాబు సర్కారు కూడా పగబట్టింది. మూడు నెలల క్రితం రాష్ట్రంపై విరుచుకుపడిన మోంథా తుఫాన్ ప్రభావంతో వేలాది ఎకరాల పంటలు నీట మునిగి రైతులు భారీగా నష్టపోయారు. వీరిని ఉదారంగా ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోకుండా అలవిమాలిన జాప్యం చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గత ఏడాది అక్టోబర్‌లో మోంథా తుఫాన్ తాకిడికి ప్రస్తుత మార్కాపురం జిల్లాలోని 19 మండలాల్లో అపార నష్టం వాటిల్లింది. ఖరీఫ్, రబీ సీజన్లలో సాగుచేసిన పత్తి, మిర్చి, వరి, సజ్జ, కంది పంటలన్నీ దాదాపు తుడిచి పెట్టుకుపోయాయి. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో 10,836 మంది రైతులు 18,800 ఎకరాల్లో సాగు చేసిన పంటలు నష్టపోయారు. వాస్తవానికి పంట నష్టం ఇంకా అధిక మొత్తంలోనే ఉన్నప్పటికీ ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాలతో నష్టం అంచనాల్లో భారీగా కోత విధించినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. తర్జనభర్జనల అనంతరం పంట నష్టం తుది జాబితా వెల్లడించిన అధికారులు.. జిల్లాలోని రైతులకు రూ.30,73,92,000 పరిహారం అందించాల్సి ఉందని పేర్కొన్నారు.
ఎప్పుడిస్తారు పరిహారం?
పంటలు దెబ్బతిని మూడు నెలలు కావస్తున్నా చంద్రబాబు సర్కారు పరిహారం అందించకపోవడంతో నష్టపోయిన రైతుల్లో ఆందోళన నెలకొంది. నవంబర్ మొదటి వారంలో కేంద్ర బృందం ఒంగోలు వచ్చి తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పొలాలను పరిశీలించి వెళ్లింది. ఈ క్రమంలోనే స్ధానిక వ్యవసాయ అధికారులు కూడా పరిహారం కోసం ప్రతిపాదనలు పంపారు. రబీ సీజన్ ముగుస్తున్నా పరిహారం మంజూరు కాకపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలకు వస్తున్న వ్యవసాయాధికారులు, వారి సహాయకులను నష్ట పరిహారం ఎప్పుడిస్తారని ప్రశ్నిస్తున్నా సరైన సమాధానం లేదని చెబుతున్నారు.


