లోటుపాట్లు లేకుండా చూడండి
మార్కాపురం జిల్లా కేంద్రంలో రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్, జేసీ సమీక్ష
మార్కాపురం: జిల్లా కేంద్రమైన మార్కాపురంలో ఈ నెల 26వ తేదీ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఇన్‌చార్జి కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించే ఎస్‌వీకేపీ కళాశాల ప్రాంగణాన్ని జేసీ పులి శ్రీనివాసులు, ఇన్‌చార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డితో కలిసి గురువారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే స్టాల్స్‌పై ఆయా శాఖల అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని డీఎస్పీ డాక్టర్ యు.నాగరాజుకు సూచించారు. మొత్తం 10 శాఖలకు చెందిన 25 స్టాల్స్ ఏర్పాటు చేయాలని, ఆయా శాఖల శకటాలను కూడా సన్నద్ధం చేయాలని కలెక్టరు ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
కలెక్టరేట్ పనులు త్వరగా పూర్తి చేయండి...
మార్కాపురం కలెక్టరేట్ పనులను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. జేసీతో కలిసి కలెక్టరేట్ ప్రాంగణానికి వెళ్లి పనులను పరిశీలించారు. ఆయా సెక్షన్ల ఆఫీసర్ల గదులు, మినిస్ట్రీరియల్ స్టాఫ్, సిబ్బంది, రికార్డు రూములు, తదితర పనులను త్వరగా పూర్తిచేయాలని చెప్పారు. ఈ నెలాఖరులోపు పనులు పూర్తికావాలని ఆదేశించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల గురించి తహసీల్దార్ చిరంజీవి కలెక్టర్‌కు వివరించారు. వారి వెంట కమిషనర్ నారాయణరావు, సీఐ సుబ్బారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


