నూరు శాతం ఉత్తీర్ణతపై దృష్టి పెట్టాలి
● కేజీబీవీని తనిఖీ చేసిన జిల్లా బాలికా విద్యాభివృద్ధి అధికారి హేమలత
వెలిగండ్ల (కనిగిరి రూరల్): కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) పదో తరగతి విద్యార్థినులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించడంపై దృష్టి పెట్టాలని జిల్లా బాలికా విద్యాభివృద్ధి అధికారి హేమలత సంబంధిత అధికారులను ఆదేశించారు. వెలిగండ్లలోని కేజీబీవీని గురువారం ఆమె తనిఖీ చేశారు. విద్యార్థినులకు అమలు చేస్తున్న వంద రోజుల యాక్షన్ ప్లాన్ తీరును పరిశీలించి సలహాలు, సూచనలు చేశారు. విద్యా శక్తి కార్యక్రమంపై 8, 9 తరగతుల విద్యార్థులకు అవగాహన కల్పించారు. పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించే విధంగా విద్యార్థులకు ప్రతి సబ్జెక్టుపై అవగాహన పెంచాలన్నారు. ఉపాధ్యాయులు విధిగా పరీక్షల పట్ల విద్యార్థినులకు భయం తొలగించాలని, వారి ప్రగతికి తోడ్పాటు ఇవ్వాలని సూచించారు. అలాగే ఎండీఎంను పరిశీలించి మెనూ అమలు తీరు గురించి విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి పలు సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ దేవిరెడ్డి రామిరెడ్డి, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఒంగోలు వన్‌టౌన్: న్యాయ విజ్ఞానం అనేది ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు అందించడం ద్వారా చాలా సమస్యలకు చట్టపరమైన పరిష్కారం దొరుకుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి షేక్ ఇబ్రహీం షరీఫ్ అన్నారు. ఒంగోలు నగరంలోని కబాడీపాలెంలో ఉన్న ప్రభుత్వ ఎస్టీ బాలికల వసతి గృహంలో లీగల్ లిటరసీ క్లబ్‌ను గురువారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాలల వసతి గృహాల్లో ఈ విధమైన లీగల్ లిటరసీ క్లబ్‌లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ క్లబ్‌ల ద్వారా విద్యార్థులకు చట్టాలపై అవగాహన కలిగించి బాల్య వివాహాల నిరోధం, మత్తు పానీయాలకు నివారణతో పాటు బాలబాలికలపై జరిగే లైంగిక నేరాల వ్యతిరేక చట్టాల గురించి అవగాహన కలిగించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని క్లబ్‌లో చేరిన విద్యార్థులు వినియోగించుకుని ఇతరులకు కూడా అవగాహన కలిగించాలని సూచించారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిలర్ జి.రవిశంకర్, డిప్యూటీ కౌన్సిలర్ పి.వీరరాఘవులు, జిల్లా సహాయ గిరిజన సంక్షేమ అధికారి కట్టా బ్రహ్మయ్య, వార్డెన్ సునీత, సిబ్బంది సునీల్ తదితరులు పాల్గొన్నారు.
నూరు శాతం ఉత్తీర్ణతపై దృష్టి పెట్టాలి


