రైల్వే జీఎంకు వినతుల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

రైల్వే జీఎంకు వినతుల వెల్లువ

Jan 22 2026 6:53 AM | Updated on Jan 22 2026 6:53 AM

రైల్వే జీఎంకు వినతుల వెల్లువ

రైల్వే జీఎంకు వినతుల వెల్లువ

మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో పలు రైల్వే స్టేషన్ల పరిశీలన

మార్కాపురం రూరల్‌ (మార్కాపురం)/గిద్దలూరు రూరల్‌/కంభం/దొనకొండ: దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌ కుమార్‌ శ్రీవాత్సవ్‌ బుధవారం మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని పలు రైల్వే స్టేషన్లను గుంటూరు డీఆర్‌ఎం సుదేశ్నా సేన్‌తో కలిసి పరిశీలించారు. నంద్యాల నుంచి గుంటూరుకు ప్రత్యేక రైలులో వెళుతున్న ఆయన మార్గం మధ్యలో గిద్దలూరు, కంభం, మార్కాపురం, దొనకొండ రైల్వే స్టేషన్లలో ఆగి అక్కడి పరిస్థితులను, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా స్టేషన్లలో పలువురు నాయకులు రైల్వే పరంగా ఉన్న సమస్యలను ఆయనకు విన్నవించారు. గిద్దలూరులో రాచర్లగేటు వద్ద బ్రిడ్జి నిర్మించాలని కోరారు. కంభం రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలో ఏటీఎం కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, పార్శిల్‌ సేవలను వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. మార్కాపురం రైల్వే స్టేషన్‌లో శ్రీశైలం వెళ్లే యాత్రికుల కోసం డార్మిటరీ నిర్మించాలని కోరారు. దొనకొండ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల కోసం కాలినడక వంతెన ఏర్పాటు చేయాలని, దొనకొండలోని రైల్వే వైద్యశాలను 24 గంటలు పని చేసేలా అనుమతులు మంజూరు చేయాలని విన్నవించారు.

పలు రైళ్ల సర్వీసుల కోసం వినతి:

సైనికులు, మాజీ సైనికులు అధికంగా ఉన్న కంభంలో గరీబ్‌ రథ్‌, ధర్మవరం, ఎస్‌ఎస్‌పీఎన్‌, తదితర స్పెషల్‌ ట్రైన్స్‌ ఆగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు–ఔరంగాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ను షిరిడీ వరకు పొడిగించాలని, గుంటూరు–తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను తిరువన్నామలై మీదుగా తిరుచురాపల్లి వరకు పొడిగించాలని కోరారు. అదేవిధంగా యర్రగుంట్ల, నంద్యాల, శావల్యాపురం, న్యూ పిడుగురాళ్ల మీదుగా తిరుపతి – హైదరాబాదు మధ్య రోజువారి రాత్రిపూట ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టాలని, కాచిగూడ – నడికుడి ప్యాసింజరును న్యూ పిడుగురాళ్ల, శావల్యాపురం మీదుగా మార్కాపురం వరకూ పొడిగించాలని కోరారు. బెంగళూరు, మైసూరుకు కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ ఫ్రీక్వెన్సీని ట్రైవీక్లీ నుంచి డైలీ నడపాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి నుంచి నంద్యాల వరకూ వచ్చే రైళ్లన్నీ మార్కాపురం వరకూ పొడిగించాలని విన్నవించారు. విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్‌ ట్రైను వేయాలని కోరారు. పగటి పూట గుంటూరు, గుంతకల్‌ మధ్య మరో రెండు రైళ్లను నడిపించాలని కోరారు. రైల్వే జీఎంను కలిసిన వారిలో మార్కాపురం ప్యాసింజర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఓఏ మల్లిక్‌, ప్రధాన కార్యదర్శి ఎన్‌సీ నరసింహాచార్యులు, మాజీ డీఆర్‌యూసీసీ మెంబరు షేక్‌ ఇస్మాయిల్‌, బీజేపీ ఇన్‌చార్జి కృష్ణారావు, దొనకొండ రైల్వే పింఛనర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి బుక్కారపు జయరాజు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement