ప్రయోజనంలేని పరిశీలనలు ఎందుకు ?
మంత్రి నిమ్మలపై ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం
యర్రగొండపాలెం: రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెలుగొండ ప్రాజెక్ట్ పనులు పరిశీలించేందుకు పదే పదే పర్యటిస్తున్నారని, మరో సారి వెలుగొండ ప్రాజెక్ట్‌కు ఆయన రాబోతున్నట్లు తెలిసిందని, ప్రయోజనంలేని ప్రాజెక్ట్ పరిశీలనలు చేయడం ఎందుకని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి ప్రాజెక్ట్‌ను పరిశీలించడం సంతోషంగా ఉందని, కానీ ఈ పరిశీలన వలన ప్రాజెక్టుకు కానీ, ప్రజలకు కానీ ఉపయోగంలేకపోవడంతోపాటు ప్రజా ధనం వృథా అవుతుందన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ వాస్తవ పరిస్థితులను తెలుసుకొని యర్రగొండపాలెం ప్రాంత ప్రజలకు మేలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే తీగలేరు–5 (టీ5) కాలువ పనులు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ పర్యటనలు మాని వెలుగొండ నుంచి యర్రగొండపాలేనికి వెళ్లే కాలువ పనులను సందర్శించాలని సూచించారు. కాలువల్లో తట్టెడు మట్టి తీయకుండా ప్రజలకు తాగు, సాగు నీరు ఏ విధంగా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి దాదాపు 20 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు కాలువ పనులు ప్రారంభించకపోవడం, ఏ పర్యటనలో కూడా కాలువల గురించి ప్రస్తావించకపోవడం ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు విస్మరించడమేనని అన్నారు. ఇంతటి నిర్లక్ష్యం చేస్తూ కూడా ప్రచారం కోసం పర్యటనలు చేయడంమాని పనులకు నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తీగలేరు కాలువ తవ్వకుండా పుల్లలచెరువు మండలానికి చుక్కనీరు వినియోగించే అవకాశంలేదని, నేటికీ భూసేకరణ పూర్తి కాలేదని, వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితుల పరిహారానికి ఇప్పటి వరకు అతీగతీలేకుండా పోయిందని విమర్శించారు. నిర్వాసితులకు రూ.1100 కోట్లకు చెల్లించింది కేవలం 10 శాతంలోపేనన్నారు. అసెంబ్లీ సాక్షిగా రూ.5 వేల కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పిన ప్రభుత్వం నేటికి కేటాయించింది రూ.300 కోట్లేనని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటికి పిలిచిన టెండర్లు, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీతో కలిపి రూ.వెయ్యి కోట్లు మాత్రమే చూపిస్తున్నారని, గత ప్రభుత్వ కాలంలో రూ.5 వేల కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పడం అబద్ధమేనని అర్థమవుతోందన్నారు. ఇటీవల వచ్చిన వరదలకు ఫీడల్ కెనాల్‌కు గండిపడి పెద్దదోర్నాల మండలంలోని కొత్తూరు, యడవల్లి ప్రాంతాల్లో జరిగిన పంట నష్టాన్ని తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, ముస్లిం మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్.బుజ్జి, మండల కన్వీనర్లు ఏకుల ముసలారెడ్డి, పాలిరెడ్డి కృష్ణారెడ్డి, నాయకులు కె.ఓబులరెడ్డి, సయ్యద్ జబీవుల్లా, వై.వెంకటేశ్వరరెడ్డి, తోకల ఆవులయ్య, ఉమామహేశ్వరరెడ్డి, ఒంగోలు సుబ్బారెడ్డి, పెద్దకాపు వెంకటరెడ్డి, రాములు నాయక్, సురేష్ నాయక్ పాల్గొన్నారు.


