రథ సప్తమి వేడుకలు
సమన్వయంతో నిర్వహించండి
మార్కాపురం టౌన్: మార్కాపురం పట్టణంలో ఈనెల 25న ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రథసప్తమి వేడుకలను వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. సబ్‌కలెక్టర్ కార్యాలయంలో బుధవారం రథసప్తమి వేడుకలపై ఆయన దేవదాయ, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ విద్యుత్, అగ్నిమాపక తదితర విభాగాల అధికారులతో ఇన్‌చార్జి సబ్‌కలెక్టర్ శివరామిరెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. తిరుమల తరహాలో చెన్నకేశవస్వామి వారు సప్తవాహనాలపై భక్తులకు దర్శనమిస్తారని, అనంతరం వెండి రథంపై నాలుగు మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తామని ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆయా శాఖల అధికారులు స్వామివారి వాహనసేవకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని జేసీ ఆదేశించారు. పారిశుధ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్ తీగలు వలన ఎవరికీ నష్టం జరగకూడదని, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలన్నారు. వివిధ వర్తక వ్యాపార సంఘాల ఆధ్వర్యంలో భక్తులకు అన్న వితరణ ఉంటుందని మాజీ చైర్మన్ యక్కలి కాశీవిశ్వనాథం తెలిపారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ శివరామిరెడ్డి, ఈఓ శ్రీనివాసరెడ్డి, సీఐ సుబ్బారావు, కమిషనర్ డీవీ నారాయణరావు, తహశీల్దార్ చిరంజీవి, పట్టణ ఎస్సై సైదుబాబు, ఎకై ్సజ్ ఎస్సై గోపాలకృష్ణ, అగ్నిమాపకశాఖాధికారి రామకృష్ణ, పట్టణ విద్యుత్ ఏఈ యశోద తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.


