ఆంగ్ల భాషపై పట్టు సాధించాలి
● డీఈఓ సీవీ రేణుక
ఒంగోలు సిటీ: విద్యార్థులు చిన్నతనం నుంచే ఆంగ్ల భాష మీద పట్టు సాధించాలని డీఈఓ సీవీ రేణుక అన్నారు. జిల్లా స్థాయి స్పెల్ బీ పోటీలు బుధవారం ఒంగోలు నగరంలోని పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈఓ సీవీ రేణుక పాల్గొని మాట్లాడుతూ మాతృభాష తెలుగు మీద పట్టు సాధించి తర్వాత ఇతర భాషల మీద కూడా పట్టు సాధించాలని కోరారు. ఇంగ్లిష్ గ్లోబల్ లాంగ్వేజ్ అని, ఇంగ్లిష్ నేర్చుకోవడం ద్వారా మనం చాలా విజయాలు సాధించవచ్చన్నారు. విద్యార్థులు రోజూ కొన్ని పదాలు నేర్చుకుని వాటిని ఉపయోగించడం సాధన చేయాలని కోరారు. లెవెల్ 2 లో విజేతలుగా కొమ్ము లాస్య, బేతంచెట్టి వీరజోత్స్న, వేనం రిషిత నిలిచారు. లెవల్ 3లో చేజర్ల చామున్‌సాయి, చెందోలు యశస్విని ఉన్నారు. లెవల్ 4లో సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థిని షేక్ షాజపర్వీన్ విజేతగా నిలిచినట్లు తెలిపారు. విజేతలు 22వ తేదీ గుంటూరులోని హిందూ హైస్కూల్లో జరగబోయే జోనల్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఇస్మాయిల్, మధు యామిని జ్యూరీ మెంబర్‌లుగా వ్యవహరించారు. కార్యక్రమంలో పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజలక్ష్మి, జిల్లా సైన్స్ అధికారి టీ రమేష్ పాల్గొన్నారు.


