భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
త్రిపురాంతకం: శ్రీబాలాత్రిపురసుంరీదేవి, శ్రీపార్వతి సమేత త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయాల్లో మహాశివరాత్రి మహోత్సవాలు భక్తులకు ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. త్రిపురాంతకం ఆలయాల వద్ద మహాశివరాత్రి ఏర్పాట్లపై అధికారుల సమీక్ష సమావేశం బుధవారం జరిగింది. ఫిబ్రవరి 15వ తేదీన జరగనున్న మహాశివరాత్రి మహోత్సవాలకు భక్తుల రద్దీకి తగిన విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. ఆలయాల వద్ద ప్రత్యేక పూజలకు తగిన ఏర్పాట్లు, దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీకి తగిన విధంగా క్యూలైన్లు, చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయాల వద్ద ట్రాఫిక్ అంతరాయం లేకుండా, తాగునీటి సౌకర్యం, సామాజిక సత్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. సమావేశంలో ఆర్‌డీఓ శివరామిరెడ్డి, దేవదాయశాఖ అధికారి శ్రీధర్‌రెడ్డి, ఈఓ అనిల్‌కుమార్, తహసీల్దార్ కృష్ణమోహన్, ఎంపీడీఓ రాజ్‌కుమార్, సీఐ అసాన్, ఎస్‌ఐ శివబసవరాజు, ఎంపీపీ ఆళ్ల సుబ్బమ్మ, సర్పంచ్ పి.వెంకటలక్ష్మి పలు శాఖల అధికారులు, ధార్మిక సంస్థల ప్రతినిధులు, సమాజిక సత్రాల నిర్వాహకులు, పలు పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
పొదిలి: స్థానిక ఒంగోలు రోడ్డులోని రైల్వే బ్రిడ్జి సమీపంలో వక్ఫ్ భూములు గత కొంత కాలంగా ఆక్రమణలకు గురవుతున్నాయి. ఈ విషయమై పలుమార్లు వక్ఫ్ బోర్డు కమిటీ సభ్యులు అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. గతంలో కొంత మేర ఆక్రమణలు తొలగించారు. అయితే పరిస్థితి యధావిధిగా మారి ఆక్రమణలు తగ్గలేదు. దీంతో బుధవారం బోర్డు సభ్యులు, అధికారులు పోలీసుల సహకారం తీసుకున్నారు. పోలీసులు మోహరించడంతో ఆక్రమణలను తొలగిస్తున్నారు. కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడినా అధికారులు ఆక్రమణల తొలగింపు విషయంలో ముందుకు పోతున్నారు.
పట్టణంలో పర్యటించిన సీఐ, కమిషనర్
పట్టణంలోని పలు ప్రాంతాల్లో సీఐ రాజేష్ కుమార్, నగర పంచాయతీ కమిషనర్ మారుతీరావు పర్యటించారు. ఆక్రమణల తొలగింపు సమయంలో ఏదైనా ఇబ్బందులు వస్తే పోలీసుల సహకారం కావాలని మారుతీరావు కోరారు. సైడు కాలువులు, రోడ్లు మార్జిన్లు ఆక్రమణలను ఉపేక్షించేది లేదని, తప్పనిసరిగా తొలగిస్తామని చెప్పారు.
తిరుపతి లీగల్: ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తిమ్మాపురానికి చెందిన ఎస్ వెంకటేశ్వరరెడ్డికి ఐదేళ్ల జైలుశిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తూ ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి బుధవారం తీర్పు చెప్పారు. కోర్టు లైజనింగ్ అధికారులు ఎన్ రాజేష్, ఎం శ్రీనివాసులు తెలిపిన కేసు వివరాల మేరకు వైఎస్సార్ కడప జిల్లా, పోరుమామిళ్ల రేంజ్ ఫారెస్ట్ సిబ్బంది 2019లో ఇటుకుల పాడు బీట్ అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి నిందితుడు వెంకటేశ్వరరెడ్డి వద్ద అక్రమంగా ఉన్న 17.50 కిలోల ఒక ఎర్రచందనం దుంగను స్వాధీనం చేసుకున్నారు. అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నేరం వెంకటేశ్వరరెడ్డిపై రుజువు కావడంతో న్యాయమూర్తి అతనికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
ఒంగోలు టౌన్: పిల్లల వ్యవహార శైలి, వారి ప్రవర్తనలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు గమనిస్తుండాలని టాస్క్‌ఫోర్స్ సీఐ సుధాకర్ అన్నారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మాదకద్రవ్యాల నియంత్రణపై బుధవారం ప్రయాణికులకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, సంబంధిత చట్టాలు, విధించే శిక్షల గురించి వివరించారు. సీఐ సుధాకర్ మాట్లాడుతూ పిల్లలు చెడు వ్యసనాల బారిన పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లలను తరుచూ గ్రంథాలయాలకు తీసుకెళ్లడం, మంచి పుస్తకాలను చదివేలా అలవాటు చేయడం చాలా అవసరమన్నారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో చదువుకోవాలన్న లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా స్కూల్స్, కళాశాలల పరిసరాల్లో పోలీసు నిఘా కొనసాగుతుందని తెలిపారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో పొగతాగుతున్న ఐదుగురిపై కేసులు నమోదు చేసి జరిమానా విధిచంచారు. డార్మిటరీలను తనిఖీ చేశారు. ఏఎస్సై షేక్ మహబూబ్ బాషా , ఈగిల్ టీం సభ్యులు పాల్గొన్నారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు


