సేవలకు ఉరి
సర్వేలతో సరి..
బేస్తవారిపేట:
ప్రజల ముంగిటకే పాలన చేరువ చేయాలనే సంకల్పంతో ఏర్పాటైన సచివాలయాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఒకవైపు సిబ్బంది కొరత, దీనికి తోడు ఉన్న ఉద్యోగులను సర్వేలంటూ ప్రభుత్వం రోడ్లపైనే తిప్పుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. పింఛన్ల పంపిణీ, కుటుంబ సర్వేలు, రెవెన్యూ సదస్సులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు చెందిన సర్వే శిక్షణ, పొలం పిలుస్తోంది వంటి ఇతరత్రా సర్వేల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు. దీంతో కార్యాలయాలకు వచ్చే ప్రజలు నిరాశతో వెనుతిరుగుతున్నారు.
మండల కేంద్రాలకు పరుగు..
గతంలో ప్రజలు చిన్నపాటి సేవలకు సైతం మండల కేంద్రం, జిల్లా కేంద్రాలకు వ్యయప్రయాసలకోర్చి వెళ్లాల్సిన పరిస్థితి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల ముంగిటకే సేవలందించింది. ప్రతి 2 వేల జనాభాకు ఒక సచివాలయం చొప్పున ఏర్పాటు చేశారు. మార్కాపురం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 306 సచివాలయాలు, 2086 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. విద్యార్థులకు ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రం, ఓబీసీ, రైతులకు రిజిస్ట్రేషన్ సేవలు, రెవెన్యూ రికార్డుల్లో మార్పులు–చేర్పులు, ఆధార్ సేవలు, పింఛన్ల నమోదు, రేషన్ కార్డుల నమోదు, జారీ..ఇలాంటి సేవలు నిరంతరం అందేలా చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి మారిపోయింది. ఇక్కడి ఉద్యోగులను ఇతర పనులకు వినియోగిస్తుండటంతో సేవలు అటకెక్కాయి.
సర్వేలతో సరి..
సచివాలయ ఉద్యోగులను వివిధ సర్వేల పేరుతో తిప్పుతున్నారు. మొన్నటి వరకు పీ4 కార్యక్రమం బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు వాట్సప్ గవర్నెన్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించేలా డోర్ టు డోర్ పంపిస్తున్నారు. డ్రైడే–ఫ్రైడే అంటూ వీధుల్లో తిప్పుతున్నారు. మరోవైపు కుటుంబ సభ్యుల సర్వేకూ పురమాయించారు. సర్వే వివరాల సేకరణకు ఒక్కో ఇంట అరగంటకు పైగానే పడుతోంది. ఆధార్ అప్‌డేట్ ఈకేవైసీ, ఆధార్ సీడింగ్–వాహన డేటా, బయోమెట్రిక్ సర్వే, జీఎస్టీ అవగాహన, పింఛన్ల పంపిణీ ఇలా లెక్కకు మించిన బాధ్యతలు అప్పగించి బయటకు పంపిస్తున్నారు.
స్పందనకు తిలోదకాలు..
ప్రజల సౌలభ్యం కోసం గ్రామ సచివాలయాల్లో గత ప్రభుత్వం స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని టీడీపీ సర్కారు నీరుగార్చింది. జిల్లాలో ఎక్కడా అధికారికంగా స్పందన కార్యక్రమాలు నిర్వహించడం లేదు. దీంతో గ్రామాల్లో చిన్నచిన్న సమస్యలు విన్నవించేందుకు కూడా ప్రతి సోమవారం మండల కేంద్రం, జిల్లా కేంద్రంలో నిర్వహించే స్పందన కార్యక్రమాలకు ప్రజలు ఎంతో వ్యయ, ప్రయాసలకోర్చి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అర్జీదారులు మారుమూల ప్రాంతాల నుంచి వెళ్లడానికి నానా అవస్థలు పడుతున్నారు. టీడీపీ సర్కారు తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాడు ప్రజలకు చేరువైన సచివాలయ వ్యవస్థ
నేడు నిర్వీర్యమవుతున్న వైనం
సర్వేలకే పరిమితమవుతున్న ఉద్యోగులు
ప్రజలకు అందని సేవలు
సేవలకు ఉరి
సేవలకు ఉరి


