రగ్బీ జాతీయస్థాయి పోటీలకు ఎంపిక ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి గుర్తు తెలియని మృతదేహం లభ్యం గుండెపోటుతో క్రైంబ్రాంచ్ ఎస్సై మృతి
తాళ్లూరు: మండలంలోని బొద్దికూరపాడు హైస్కూల్ విద్యార్థి గుజ్జల అభినయ్‌రెడ్డి రగ్బీలో జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 21, 22 తేదీల్లో ఒడిశా రాష్ట్రాం కళింగ స్టేడియంలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో మన రాష్ట్రం తరఫున పాల్గొంటున్నట్లు పీడీ రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రధానోపాధ్యాయుడు పి.సుబ్బారావు, గ్రామస్తులు అభినందించారు.
కురిచేడు: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని పంటపొలాల్లో చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం జరిగింది. పొలం పనులకు వెళ్లిన కూలీలు చెట్టుకు మృతదేహం వేలాడుతూ కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏఎస్సై మోహన్‌రావు, సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడు మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం గణపవరం గ్రామానికి చెందిన చల్లా సత్యనారాయణ(24)గా గుర్తించారు. మృతుని కుటుంబసభ్యులకు సమాచారం నిర్వహించారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.
కొమరోలు: ఓ వ్యక్తి దుకాణంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. ఈ సంఘటన స్థానిక గ్రామీణ బ్యాంక్ వీధిలో మంగళవారం జరిగింది. కలకత్తాకు చెందిన జహంగీర్ లస్కర్ (38) ఈ నెల 1వ తేదీన స్థానికంగా ఓ బొటెక్ షాపులో మగ్గం వర్క్ చేయడానికి పనికి కుదిరాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున జహంగీర్ లస్కర్ గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న ఎస్సై తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతునికి భార్య ఉండగా, బంధువులు వచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
గుడ్లూరు: మండలంలోని చేకూరు అడవి లక్ష్మీపురం గ్రామాల మధ్య గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందని ఎస్సై వి.వెంకట్రావు తెలిపారు. మృతునికి 60 నుంచి 65 మధ్య వయసు ఉంటుందని, మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. మృతదేహాన్ని గుర్తుపట్టిన వారు 9121102206, 9440700027 నంబర్లను సంప్రదించాలని కోరారు.
వినుకొండ/కురిచేడు: వ్యక్తిగత పనులపై వినుకొండ వచ్చిన ఎస్సై ఒకరు గుండెపోటుతో మృతి చెందిన విషాదఘటన వినుకొండ పట్టణంలో మంగళవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే..ప్రకాశం జిల్లా కురిచేడుకు చెందిన డి.లక్ష్మీప్రసాద్ (60) గతంలో వినుకొండలో ఎస్సైగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం నరసరావుపేటలోని జిల్లా క్రైం బ్రాంచ్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే స్వగ్రామం కురిచేడులో నిర్మిస్తున్న గృహానికి సామగ్రి కొనుగోలు చేసేందుకు వినుకొండ రైల్వేస్టేషనుకు వచ్చిన ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే వినుకొండ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. వినుకొండ పోలీసులు ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.


