ఇళ్లపై యమపాశాలు తొలగించండి
మార్కాపురం: పట్టణంలోని కరెంటు ఆఫీసు వెనుక వైపు వీధుల్లో మిద్దె ఎక్కితే చేతికందేంత ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను వెంటనే తొలగించాలని 17, 18 బ్లాక్ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జిలు షేక్ కరీముల్లా, సయ్యద్ గఫూర్, సీపీఐ నాయకులు అందె నాసరయ్య, ఎస్‌కు ఖాశీం డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక తర్లుపాడు రోడ్డులోని సబ్‌స్టేషన్ ఎదుట ప్రజలతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యుత్ తీగల కారణంగా సుమారు ఐదుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారని, నాలుగు రోజుల క్రితం ఖాశిం అనే బాలుడికి విద్యుత్ తీగలు తగిలి ఒళ్లంతా కాలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఎంతమంది బలికావాలని ప్రశ్నించారు. మిద్దె ఎక్కాలంటే భయం వేస్తోందని, ఇలా ఎన్నాళ్లు భయం గుప్పిట్లో జీవించాలని నిలదీశారు. పిల్లలు, పెద్దలు దినదినగండంగా ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికై నా స్పందించి విద్యుత్‌వైర్లను మార్చకుంటే కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా విద్యుత్ షాక్ తగిలి చేతులు కోల్పోయిన పోసాని సుధీర్, శ్రీనును ధర్నాకు తీసుకొచ్చి వారి మానసిక ఆవేదనను వివరించారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ధర్నాపై ఏడీఏ షియా నాయక్ స్పందించి ఆందోళనకారులతో మాట్లాడారు. త్వరలో విద్యుత్ వైర్లను మారుస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ వార్డు అధ్యక్షుడు గుర్రం వెంకటేశ్వర్లు, సయ్యద్ సర్దార్, సీఎం ఖాశిం, కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ మహబూబ్‌వలి, కాలనీవాసులు పాల్గొన్నారు. కాగా కాలనీ వాసుల ధర్నాతో తర్లుపాడు రోడ్డులో ట్రాఫిక్ నిలిచిపోయింది. విద్యుత్ సిబ్బంది, పోలీసులు కలిసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
వైఎస్సార్ సీపీ, సీపీఐ నాయకుల డిమాండ్
మార్కాపురం విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ధర్నా
ఇళ్లపై యమపాశాలు తొలగించండి


