దేశీయ రొయ్యల పరిశ్రమను కాపాడండి
ఒంగోలు సబర్బన్: దేశీయ రొయ్యల పరిశ్రమను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని జిల్లా రొయ్యల రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు దుగ్గినేని గోపీనాఽథ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక జిల్లా సంఘం కార్యాలయంలో మంగళవారం జిల్లా సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో గోపీనాఽథ్ మాట్లాడుతూ ఆగ్నేయాసియా దేశాల నుండి తల్లి రొయ్యలను పీపీపీ పద్ధతిలో దిగుమతి చేసుకోవటానికి ఎత్తులు జరుగుతున్నాయన్నారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ఈ నెల 22న ఢిల్లీలో కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారులు సమావేశం ఏర్పాటు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఆగ్నేయాసియా దేశాల నుంచి దిగుమతి చేసుకొనే ప్రయత్నాలను నిలుపుదల చేసి దేశయ రొయ్యల పరిశ్రమను కాపాడాలని డిమాండ్ చేశారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న రొయ్యల్లో 70 శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. 1990 దశకంలో ఆగ్నేయాశియా దేశాల నుంచి దిగుమతి అయిన తల్లి రొయ్యల నుంచి మన దేశంలోకి తెల్ల మచ్చల వ్యాధి వచ్చిందన్నారు. అదే విధంగా 2010లో ఈహెచ్‌పీ వ్యాధితో పాటు అనేక రకాల వ్యాధులు వచ్చి రాష్ట్రంలోని రొయ్యల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కంతూరి సుబ్బారెడ్డి, నాయకులు శింగంనేని అంజిబాబు, చేపల రమణయ్య, బత్తుల రమేష్ రెడ్డి, శ్రీనివాస రావు, నరేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
ఆగ్నేయాసియా దేశాల నుంచి
తల్లి రొయ్యల దిగుమతి ఆపాలి
జిల్లా రొయ్యల రైతుల సంఘం
సమావేశం జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్


