పాఠశాలల్లో మౌలిక వసతులపై దృష్టి సారించాలి
విద్యాశాఖ అధికారులకు డీఈఓ సీవీ.రేణుక ఆదేశం
ఒంగోలు సబర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సీవీ రేణుక విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆమె స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ భవన్‌లో ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ఇంజినీర్లతో ప్రత్యేకంగా మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో అత్యవసరమైన అన్నిరకాల మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. అందుకోసం ఎంఈఓలు, ఇంజినీరింగ్ విభాగం అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఫిబ్రవరి నెలాఖరులోగా బాలికల టాయ్‌లెట్స్ పూర్తి చేసి వచ్చే మార్చి 8 మహిళా దినోత్సవం నాటికి వినియోగంలోకి రావాలన్నారు. ప్రహరీలు, అత్యవసరమైన రిపేర్లు తక్షణమే చేపట్టాలని అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త డి.అనీల్ కుమార్ ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ విద్యాశాఖ అధికారులు చంద్రమౌళీశ్వర్, ఎం.శ్రీనివాసులు, డీసీఈబీ సెక్రటరీ ఎం.శ్రీనివాసులు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటరత్నంతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.


