ఒంగోలులో పోలీసు స్పందనకు 48 ఫిర్యాదులు
ఒంగోలు టౌన్: స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 48 ఫిర్యాదులు వచ్చాయి. భూ వివాదాలు, ఆర్థిక మోసాలు, అత్తారింటి వేధింపులు, చీటింగ్ వంటి ఫిర్యాదులు అత్యధికంగా వచ్చాయి. సోమవారం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పలువురు బాధితులు తమ సమస్యలను నేరుగా పోలీసు అధికారులకు విన్నవించుకున్నారు. రాత పూర్వకంగా ఫిర్యాదులు అందజేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసు అధికారులు వారితో నేరుగా మాట్లాడి ఫిర్యాదుల పూర్వాపరాలడిగి తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదుల మీద చట్టపరంగా విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ వీవీ రమణ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, కొండపి సీఐ సోమశేఖర్, సంతమాగులూరు సీఐ టి.వెంకటరావు, పీసీఆర్ సీఐ దుర్గా ప్రసాద్, ప్యానల్ అడ్వకేట్ బి.బాలాజీ సింగ్, మీ కోసం ఎస్సై జనార్దన్‌రావు పాల్గొన్నారు.


