ప్రతి బిడ్డకు టీకాలు వేయాలి
● డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు
ఒంగోలు టౌన్: ప్రతి ఒక్క శిశువుకు తప్పనిసరిగా టీకాలు వేయాలని, ఏ ఒక్కరినీ మిస్ చేయడానికి వీలులేదని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు ఆదేశించారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని కాన్ఫరెన్స్ హాలులో వ్యాక్సిన్–ప్రివెంటివ్ డిసీజెస్ అంశంపై సోమవారం ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ వ్యాక్సినేషన్ విషయాన్ని వైద్యాధికారులందరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. శిశువు వయసును బట్టి క్రమం తప్పకుండా టీకాలు అందించాలని చెప్పారు. ప్రతి బుధవారం, శనివారం జరిగే వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం గురించి ముందుగానే ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. టీకాలు వేయించడం వలన వ్యాధులు రావని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. తర్వాత నెలలో ఏ తేదీ టీకా వేయడం జరుగుతుందో ముందుగానే తెలియజేయాలన్నారు. వ్యాధి నిరోధక టీకాలను సకాలంలో అందించడం ద్వారా శిశు మరణాలు నివారించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ కమల శ్రీ, నోడల్ అధికారి డాక్టర్ భగీరధి పాల్గొన్నారు.


