ప్రమాదాల దారి
ఆధ్యాత్మిక తోవ..
చింతల వద్ద రోడ్డు కుంగటంతో లోయ వైపునకు ఒరిగిన ఓ వాహనం (ఇక్కడ 500 అడుగుల లోయ ఉంది)
పెద్దదోర్నాల:
జ్యోతిర్లింగ క్షేత్రాల్లో శ్రీశైలం ప్రధానంగా ఉంది. నల్లమల అటవీ ప్రాంతం పర్యాటకులకు స్వర్గధామం. దీంతో దేశం నలుమూలల నుంచి భక్తులు, పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం క్షేత్రానికి ఘాట్ రోడ్డు ప్రయాణం ఉంటుంది. 50 కిలో మీటర్లు దూరం ఉండే రహదారి అంతా ఘాట్ రోడ్డే. ఈ మార్గంలో నిత్యం వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు ఎన్నో రాష్ట్రాల నుంచి పలు ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది భక్తులు వందలాది వాహనాల్లో ఈ రహదారి మీదుగా శివ క్షేత్రానికి చేరుకుంటారు. సాధారణ రోజుల్లో రోజుకు 500 వరకూ చిన్నా, పెద్దా వాహనాలు వస్తుంటాయి. సెలవు, ప్రత్యేక రోజుల్లో పుణ్యక్షేత్రానికి వచ్చే వాహనాల రద్దీ రెట్టింపు ఉంటుంది. అలాగే శ్రీశైలంతో పాటు, శ్రీశైలం ప్రాజెక్టు కాలనీల్లో చేపడుతున్న నిర్మాణాలకు అవసరమైన నిర్మాణ సామాగ్రిని తరలిస్తూ అధిక లోడుతో వెళ్లే వాహనాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా నిత్యం ప్రయాణిస్తున్న అధిక లోడు వాహనాల వల్లే రహదారులు కుంగుతున్నాయని పలువురు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏడు దశాబ్దాలకు ముందు ఘాట్‌కు బీజం...
1955కు ముందు నల్లమల మీదుగా శ్రీశైలం ప్రయాణం కష్టతరంగా ఉండేది. వన్యమృగాల బెడద, కారడవి మార్గంలో భక్తులు కష్టాలు పడేవారు. 1950లో అప్పటి మద్రాసు సీఎం, ఆర్థిక మంత్రులు ఘాట్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక చేశారు. 1955–57లో రూ.69 లక్షల వ్యయంతో 49 కిలోమీటర్ల ఈ రహదారి పూర్తి చేశారు. ఓ వైపు కొండను తొలిచి రహదారులను నిర్మించారు. అప్పటి నుంచి అప్పుడప్పుడూ రహదారి మరమ్మతు పనులు చేపడుతూ వస్తున్నారు. అయితే నాటి పరిస్థితులకు, నేటికీ ఎంతో వ్యత్యాసం ఉంది. ఒకప్పుడు దేవస్థానానికి చెందిన వాహనాలు, కొన్ని ప్రైవేట్ వాహనాలు మాత్రమే భక్తులతో ఈ రహదారిలో ప్రయాణించేవి. నేడు శ్రీశైలం మల్లన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. నిత్యం తరలి వచ్చే వాహనాల సంఖ్యకూడా అంతే స్థాయిలో పెరిగింది. అలాగే శ్రీశైల పుణ్యక్షేత్రంతో పాటు, శ్రీశైలం ప్రాజెక్టు కాలనీల్లో ఏ నిర్మాణం జరిగినా సిమెంట్, ఇటుక, ఇసుక, డస్ట్ తదితర నిర్మాణ సామగ్రి మండల కేంద్రమైన దోర్నాల నుంచే వెళ్లాల్సి ఉంటుంది. దీంతో లారీ, టిప్పర్ యజమానులు ఎక్కువ టన్నేజీతో ఆయా సామాగ్రిని శ్రీశైలం తరలిస్తుండటం వల్లే రోడ్లు ఇలా ప్రమాదకర స్థాయికి చేరాయని తెలుస్తోంది.
పలు చోట్ల లోయల వైపు కుంగుతున్న రహదారులు....
ఘాట్ రోడ్డులో లోయల అంచులకు రక్షణగా నిర్మించిన గోడలు దెబ్బతినటంతో పాటు, పలు చోట్ల రహదారులు లోయల వైపు కుంగుతున్నాయి. ముఖ్యంగా చింతల, తుమ్మలబైలు, చిన్నారుట్ల వద్ద ఉన్న జిలేబీ టర్నింగ్ ఘాట్‌రోడ్లలో పలు చోట్ల రహదారులు లోయల వైపునకు కుంగి ప్రమాదకరంగా మారాయి. దీంతో పాటు ఆయా ప్రాంతాల్లో రహదారులు నిట్టనిలువునా చీలిపోయి భక్తులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. దీంతో లోయ వైపు ప్రయాణించాలంటేనే వాహనదారులు హడలిపోతున్నారు. శ్రీశైలం ఘాట్‌రోడ్లలో ప్రమాదకర మలుపులతో కూడిన ఘాట్‌రోడ్లు ఎన్నో ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో వెయ్యి అడుగులపైనే లోతున్న ప్రమాదకరమైన లోయలున్నాయి. అధికారులు ఏటా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రోడ్ల ఆధునుకీకరణ కోసం కోట్లాది రూపాయల నిధులను ఖర్చు చేస్తున్నారు. అయితే కుంగుతున్న రోడ్ల గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. గతంలో తుమ్మలబైలు ఘాట్‌లో రోడ్డు ఓ వైపునకు కుంగి పోవటంతో లారీ లోయలోకి జారి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. సుమారు వెయ్యికి పైగా అడుగుల లోతున్న ఈ ప్రాంతంలో రోడ్లు కృంగి ప్రమాదకరస్థాయికి చేరుకున్నాయన్న విషయాన్ని ఇప్పటికై నా అధికారులు గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గత ఏడాది అక్టోబర్ నెలలో ప్రధాని మోదీ శ్రీశైలానికి వచ్చారు. ఈ సందర్భంగా మొక్కుబడిగా రహదారులు మరమ్మతులు చేపట్టి మమ అనిపించారన్న ఆరోపణలు ఉన్నాయి. దోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే ఘాట్ రోడ్ విస్తరణ చేపడతామని అధికార యంత్రాంగం చెబుతున్నా అది కార్యరూపం దాల్చలేదు. ఈ ప్రాంతమంతా నాగార్జునసాగర్– శ్రీశైలం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం (టైగర్ రిజర్వ్) కింద ఉంది. ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టాలన్నా అటవీశాఖ అనుమతులు తప్పని సరి.
ప్రమాదాల దారి


