ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

Jan 20 2026 7:32 AM | Updated on Jan 20 2026 7:32 AM

ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

ఈనెల 27 నుంచి ప్రాక్టికల్స్‌ ఫిబ్రవరి 23 నుంచి పబ్లిక్‌ ఎగ్జామ్స్‌ ఆర్‌ఐఓ కార్యాలయంలో కంట్రోల్‌ రూం కలెక్టర్‌ రాజాబాబు

ఒంగోలు వన్‌టౌన్‌: ఇంటర్మీడియెట్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ పీ రాజాబాబు ఆదేశించారు. ఈనెల 27వ తేదీ నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలు, ఫిబ్రవరి 23వ తేదీ నుంచి పబ్లిక్‌ ఎగ్జామ్స్‌ ప్రారంభం కానున్నందున అధికారులతో కలెక్టర్‌ సోమవారం ప్రకాశం భవనంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన మార్గదర్శకాలు, జిల్లాలోని పరిస్థితిని ఆర్‌ఐఓ ఆంజనేయులు ఈ సందర్భంగా కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్‌ స్పందిస్తూ వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ పరీక్షల నిర్వహణ ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లు, కస్టోడియన్లు, సిట్టింగ్‌ స్క్వాడ్స్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ విధుల నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా వ్యవహరించాలని చెప్పారు. ప్రశ్న పత్రాలు, ఆన్సర్‌ షీట్స్‌ తరలింపు సమయంలో బందోబస్తు, పరీక్షల సమయంలో నిరంతరాయ విద్యుత్‌ సరఫరా, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా రవాణా సౌకర్యం, పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, వైద్య శిబిరం ఏర్పాటు, పారిశుద్ధ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రాక్టికల్స్‌ పరీక్షల దృష్ట్యా ఆయా కేంద్రాల పరిధిలోని తహసీల్దార్లు, ఎస్సైలు మంగళవారం నుంచే కేంద్రాలను తనిఖీ చేసి మౌలిక సదుపాయాలను పరిశీలించాలని కలెక్టర్‌ ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసేందుకు ఆర్‌ఐఓ కార్యాలయంలో మంగళవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేసేలా కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. 08592– 281275, 9502023072 నంబర్లతో కమాండ్‌ కంట్రోల్‌ రూం పనిచేస్తుందని ఆర్‌ఐఓ తెలిపారు.

జిల్లాలో పరీక్షల నిర్వహణ ఇలా..

ప్రకాశం, మార్కాపురం జిల్లాలను ఉమ్మడిగానే పరిగణలోకి తీసుకొని ఈ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ప్రాక్టికల్‌ పరీక్షలు ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు జరుగుతాయి. జనరల్‌ ప్రాక్టికల్స్‌ కోసం 99 సెంటర్లు, ఒకేషనల్‌ ప్రాక్టికల్స్‌ కోసం 34 సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రాక్టికల్స్‌ పరీక్షలు నాన్‌–జంబ్లింగ్‌ విధానంలో జరుగుతాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ప్రాక్టికల్స్‌ ఉంటాయి. ఒకేషనల్‌ ప్రాక్టికల్స్‌ కోసం మొదటి సంవత్సరం 1939 మంది, రెండో సంవత్సరం 1665 మంది హాజరుకానున్నారు. జనరల్‌ ప్రాక్టికల్స్‌ విభాగంలో మొదటి ఏడాది ఏమీ ఉండవు. రెండో ఏడాది 9956 మంది విద్యార్థులు హాజరవుతారు. మొత్తంగా ప్రాక్టికల్స్‌ పరీక్షలకు 13,560 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పబ్లిక్‌ పరీక్షల కోసం 67 సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. మొదటి సంవత్సరం పరీక్షలకు జనరల్‌ కేటగిరీలో 18,712 మంది, ఒకేషనల్‌ కేటగిరీలో 1770 మంది హాజరవుతారు. రెండో సంవత్సరం పరీక్షలకు జనరల్‌ కేటగిరీలో 20,735 మంది, ఒకేషనల్‌ కేటగిరీలో 1539 మంది హాజరవుతారు. మొత్తంగా పబ్లిక్‌ పరీక్షలను 42,756 మంది విద్యార్థులు రాస్తారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం సహించనని కలెక్టర్‌ స్పష్టం చేశారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్లు, డీఈవో రేణుక, ఆర్టీసీ సూపరింటెండెంట్‌ ఫణి కుమార్‌, ఏపీ సీపీడీసీఎల్‌ ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు, డీఎస్‌పీ రమణ కుమార్‌, పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement