రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించండి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
దర్శి: సీహెచ్‌సీలో వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది కలిసికట్టుగా పనిచేసి రోగులకు మెరుగైన సేవలు అందించాలని దర్శి ఎమ్మెల్యే వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశించారు. స్థానిక సీహెచ్‌సీని సోమవారం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సందర్శించారు. ముందుగా ఓపీ కౌంటర్ వద్ద ఓపీ చేస్తున్న విధానం పరిశీలించి రోగులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు సకాలంలో మందులు అందుతున్నాయా లేదా అడిగి తెలుసుకున్నారు. వ్యాధిగస్తులకు ఎన్ని రోజులకు మందులు ఇస్తున్నారు, ఆస్పత్రిలో వైద్యుల సిబ్బంది పనితీరు ఎలా ఉంది అని వారిని అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించి వారికి తగు సూచనలిచ్చారు. అనంతరం వైద్యులతో సమావేశం ఏర్పాటు చేసి ఆస్పత్రిలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ప్రాంగణం మొత్తం తిరిగి పరిశీలించి బాత్రూంలు, డ్రైనేజీ వంటి సౌకర్యాల ఏర్పాటుపై చర్చించారు. ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్న విధానంపై వైద్య సేవ ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా శివ ప్రసాద్ రెడ్డితో గర్భిణులు మాట్లాడుతూ తమకు కూర్చోవడానికి కుర్చీలు లేవని, ఓపీ అయ్యే వరకు నిలబడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వెంటనే కుర్చీలు ఏర్పాటు చేయిస్తానని శివప్రసాద్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు. అనంతరం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆస్పత్రిలో రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారిని గౌరవించి ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా వైద్య సేవలు అందించాలని సూచించారు. మందుల కొరత ఉంటే వెంటనే తెప్పించుకొని పూర్తిస్థాయి వైద్యాన్ని ఆస్పత్రిలోనే అందించాలని చెప్పారు. పేద రోగులు ప్రైవేటు ఆస్పత్రిలోకి వెళ్లకుండా మెరుగైన వైద్యం అందించేందుకు ప్రతి వైద్యులు వైద్య సిబ్బంది కృషి చేయాలన్నారు. పలు ప్రమాదాల్లో ఇతర కారణాలతో రాత్రిపూట వచ్చే రోగులకు కూడా అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఆనందబాబు, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించండి


