గడువులోగా అర్జీలు పరిష్కరించాలి
మార్కాపురం: నిర్ణీత గడువులోగా అర్జీలను పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ పీ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. మార్కాపురం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఆయా అర్జీలను సంబంధిత రెవెన్యూ అధికారులకు, రెవెన్యూ క్లినిక్‌కు పంపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రత్యేకంగా రెవెన్యూ సమస్యలపై వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.
రెవెన్యూ సమస్యలే అధికం:
జిల్లా వ్యాప్తంగా వచ్చిన అర్జీదారుల్లో ఎక్కువగా రెవెన్యూ సమస్యలే ఉన్నాయి. దీంతో వచ్చిన అర్జీలను కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్‌కు పంపారు. ఆయా మండలాల తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది ఆ అర్జీలను స్వీకరించారు. డీఆర్‌ఓ చిన్న ఓబులేష్, మార్కాపురం, కనిగిరి ఆర్డీఓలు శివరామిరెడ్డి, కేశవర్ధన్‌రెడ్డి, వెలుగొండ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సత్యనారాయణ, మార్కాపురం తహశీల్దార్ చిరంజీవి, కమిషనర్ నారాయణరావు, వ్యవసాయశాఖ ఏడీ బాలాజీ నాయక్, హౌసింగ్ డీఈ పవన్‌కుమార్, ఎలక్ట్రిక్ ఈఈ నాగేశ్వరరావు, ఆర్టీఓ చందన, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. మొత్తం 165 అర్జీలు రాగా అందులో 92 రెవెన్యూ శాఖ అర్జీలు, 76 ఇతర శాఖలకు సంబంధించిన అర్జీలు వచ్చినట్లు తెలిపారు.
నష్టపరిహారం ఇప్పించండి
2024 డిసెంబర్ 30 న పొలానికి వెళ్లిన మా అమ్మ సుబ్బలక్ష్మమ్మ కరెంటు షాక్‌కు గురై మృతి చెందింది. ఆ కేసుకు సంబంధించి ఇంత వరకూ నిందితులను అరెస్టు చేయడం కానీ, నష్టపరిహారం కానీ ఇప్పించలేను. చాలా సార్లు ఈ సమస్యను పరిష్కరించాలని కోరాం. ఇప్పటికై నా నా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నా.
– మీనిగ పుల్లయ్య, వెంకటాపురం, బేస్తవారిపేట మండలం
గడువులోగా అర్జీలు పరిష్కరించాలి


