బొట్లగూడూరులో దాడిపై నాన్‌బెయిలబుల్ కేసు పెట్టాలి
ఒంగోలు సబర్బన్: కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని బొట్లగూడూరులో మీమల దిన్నె మహేష్‌పై జరిగిన దాడిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని జిల్లా రజక సంఘ నాయకులు అధికారులను డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితులతో పాటు జిల్లా రజక సంఘ నాయకులు సోమవారం ఒంగోలు కలెక్టరేట్ ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలకు సత్వర పరిష్కారాన్ని చూపాలని కలెక్టర్ పీ రాజాబాబు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, జాన్సన్, కళావతిలతో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి పలు సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులు అందించిన వినతులను పరిశీలించి నాణ్యతతో వాటి పరిష్కారానికి సంబంధించిన అర్జీని వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో మొత్తం 308 వినతులు రాగా అందులో రెవెన్యూ సంబంధిత అంశాలపై 195 వినతులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.


