సంతాన సాఫల్య కేంద్రాలు నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

సంతాన సాఫల్య కేంద్రాలు నిబంధనలు పాటించాలి

Jul 31 2025 7:44 AM | Updated on Jul 31 2025 9:05 AM

సంతాన సాఫల్య కేంద్రాలు నిబంధనలు పాటించాలి

సంతాన సాఫల్య కేంద్రాలు నిబంధనలు పాటించాలి

ఫర్టిలిటీ సెంటర్లను తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ

ఒంగోలు టౌన్‌: ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఏఆర్‌టీ, సరోగసి సెంటర్లను నిర్వహిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ టి.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఏఆర్‌టీ, సరోగసీ సెంటర్లు ప్రతినెలా 5వ తేదీలోపు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఏఆర్‌టీ, సరోగసి చట్టం కింద రిజిస్టరైన ఆస్పత్రులను బుధవారం జిల్లా వైద్యాధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అర్హత కలిగిన వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది పనిచేస్తున్నారా లేదా అని పరిశీలించారు. నిర్ధేశించిన వైద్య పరికరాలు వినియోగిస్తున్న తీరును పరిశీలించారు. వివిధ ఆసుపత్రుల రికార్డులను పరిశీలించి చూశారు. వైద్యశాలలో లభిస్తున్న సేవలు, వాటి ఫీజుల వివరాలు రోగులకు అర్థమయ్యే భాషలో ప్రదర్శించాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో సమర్పించిన సమాచారం ప్రకారం సిబ్బంది అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఏదైనా మార్పులు చేర్పులు చేస్తే వెంటనే జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయానికి తెలియజేయాలని చెప్పారు. జిల్లాలో ఎవరైనా సరే రిజిస్ట్రేషన్‌ లేకుండా ఆస్పత్రి, ల్యాబరేటరీ, డయాగ్నోస్టిక్‌ సెంటర్లు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉంటే తెలియజేయాలని చెప్పారు. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాస్‌ మీడియా అధికారి డి.శ్రీనివాసులు పాల్గొన్నారు.

సమస్యలపై ‘రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’

ఒంగోలు సిటీ: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఆగస్టు 5వ తేదీ నుంచి శ్రీరండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు సమస్యలు, వారికి రావాల్సిన బకాయిలపై చర్చించేందుకు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. మూడు నెలల పాటు జరిగే కార్యక్రమంలో వారానికి ఒక సమస్యను లేవనెత్తుతామన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వరకుమార్‌, రామన వెంకటేశ్వరరెడ్డి, వెంకటేశ్వరరావు కోశాధికారి రంగారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మోటార్‌ శ్రీనివాస్‌రావు, కోశాధికారి ఏసురత్నం, తాలూకా అధ్యక్షుడు సురేష్‌, అంకబాబు తదితరులు పాల్గొన్నారు.

రూ.281.52 కోట్ల రాయితీల మంజూరు

ఒంగోలు సబర్బన్‌: జిల్లా వ్యాప్తంగా నెలకొల్పిన పరిశ్రమలకు రాయితీ కింద రూ.281.52 కోట్లు మంజూరు చేసినట్లు జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోపాలకృష్ణ తెలిపారు. ప్రకాశం భవనంలోని జాయింట్‌ కలెక్టర్‌ ఛాంబర్‌లో బుధవారం డీఐఈపీసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలోని 104 పరిశ్రమలకు చెందిన క్లెయిమ్‌లు వచ్చాయన్నారు. సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌ ద్వారా అనుమతుల కోసం దరఖాస్తు చేసిన వాటికి ఎస్‌ఎల్‌ఏ సమయం వరకు వేచి ఉండకుండా త్వరితగతిన మంజూరు చేయాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించామని తెలిపారు.

నర్సింగ్‌ అభ్యర్థులకు జర్మనీలో ఉద్యోగావకాశాలు

ఒంగోలు వన్‌టౌన్‌: నర్సింగ్‌ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థులకు జర్మనీలో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి జె.రవితేజ యాదవ్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ, సామాజిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి కేంద్రాల్లో పూర్తి ఉచిత వసతితో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 8 నెలల నుంచి 10 నెలల పాటు శిక్షణ ఉంటుందన్నారు. బీఎస్సీ నర్సింగ్‌ చేసిన వారికి రెండేళ్ల క్లినికల్‌ అనుభవం, జీఎన్‌ఎం నర్సింగ్‌ చేసిన వారికి మూడేళ్ల క్లినికల్‌ అనుభవం ఉండాలని తెలిపారు. అభ్యర్థులు 35 ఏళ్ల లోపు ఉండాలన్నారు. 8 నెలల నుంచి 10 నెలల శిక్షణలో జర్మన్‌ లాంగ్వేజ్‌ బీ2 స్థాయి పరీక్ష ఉత్తీర్ణత సాధించాలని చెప్పారు. వీసా, విమాన టికెట్‌ ఖర్చులు ఉద్యోగం ఇచ్చే కంపెనీలు భరిస్తాయన్నారు. రూ.2,40,000 నుంచి రూ.3,10,000 వరకు జీతం ఉంటుందన్నారు. అభ్యర్థులు 9988853335, 8712655686 నంబర్లను సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement