
పరిమితికి మించి సాగుచేస్తే నష్టాలే
● పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్‌కుమార్
పొదిలి: పొగాకు రైతులు అనుమతించిన దానికంటే అధికంగా సాగు చేస్తే నష్టపోయే అవకాశం ఉందని పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్‌కుమార్ అన్నారు. స్థానిక పొగాకు వేలం కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా వేలం సరళిని పరిశీలించి రైతులతో సమావేశమయ్యారు. రానున్న పంట కాలానికి బోర్డు అనుమతించిన 142 మిలియన్ కేజీల సాగుకు మాత్రమే రైతులు పరిమితం కావాలన్నారు. అంతర్జాతీయంగా దేశీయ పొగాకుకు బ్రెజిల్, జింబాబ్వే దేశాలు పోటీగా ఉండేవన్నారు. ప్రస్తుతం తాంజానియా, ఉగాండ, మలాభి వంటి దేశాలు ఎఫ్‌సీవి పొగాకును సాగు చేసి దేశీయ పొగాకు మార్కెట్‌కు గట్టి పోటీ ఇస్తున్నాయని చెప్పారు. రానున్న పంట కాలానికి రైతులు అధిక ధరలకు బ్యారన్‌లు, పొలాలు కౌలుకు తీసుకోవద్దని సూచించారు. లోగ్రేడ్ పొగాకు కొనుగోళ్లలో ఏర్పడిన సంక్షోభాన్ని తొలగించేందుకుకంపెనీల యాజమాన్యాలు, ఉన్నతాధికారులతో మాట్లాడి లోగ్రేడ్ పొగాకును కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. రైతులు మార్కెట్ సరళిని గమనించి బోర్డు అధికారులు, క్షత్ర సిబ్బంది సూచించిన బేళ్లను మాత్రమే వేలం కేంద్రాలకు తీసుకురావాలని ఆయన కోరారు. అదనపు పంట అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుందన్నారు. రైతుల వద్ద ఉన్న మొత్తం పొగాకును అమ్ముకునే విధంగా పొగాకు బోర్డు చర్యలు తీసుకుంటుందన్నారు. వ్యాపారులతో సమావేశమైన ఆయన.. లోగ్రేడ్ పొగాకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలని కోరారు. వేలం కేంద్రాలకు రైతులు లోగ్రేడ్ పొగాకు మాత్రమే తీసుకవస్తున్నందున కొనుగోలు చేయలేక పోతున్నామని వ్యాపారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వేలం అధికారి జి.గిరిరాజ్‌కుమార్, రైతులు పాల్గొన్నారు.