
సాక్షి, విజయవాడ: ఏపీలో లిక్కర్ స్కాంలో కూటమి నేతలు రోజుకో పిట్ట కథ చెబుతున్నారని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజల దృష్టిని మరల్చడానికి లిక్కర్ స్కాంను తెర మీదకు తెచ్చారని వ్యాఖ్యలు చేశారు. పెద్ద పెద్ద లిక్కర్ బ్రాండ్లు తీసుకువస్తే లిక్కర్ రెవెన్యూ పెరగాలి కదా? అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే ఘోరంగా విఫలమైంది. ప్రజల తిరస్కరణకు గురైన కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుంది. లిక్కర్ స్కాం పేరుతో ప్రజల దృష్టిని మరల్చాలని భావిస్తుంది. అడ్డగోలుగా కేసులు పెడుతున్నారు. స్కాం ఎక్కడో ఇప్పటికీ తెలియడం లేదు. లిక్కర్ స్కాం డబ్బులు గల్ఫ్ అంటారు.. ఆఫ్రికా అంటారు.. ఎన్నికల్లో ఖర్చు పెట్టారు అన్నారు. రోజూ ఏదో ఒక పిట్టకథ చెప్తున్నారు. లేని.. జరగని ఒక స్టోరీ చెప్పి అక్రమ కేసులు పెడుతున్నారు. లిక్కర్ స్కాం పేరుతో ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
కేసుల పేరు చెప్పు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకుంటున్నారు. ప్రజల్లోకి వైఎస్ జగన్ వెళ్లకుండా అడ్డుకోవడానికి ఏదో ఒక డైవర్షన్ చేస్తున్నారు ఏపీలో ఒక ECM ఇద్దరు DCM లు ఉన్నారు. ఇద్దరు DCMలలో ఒకరు డిప్యూటీ సీఎం అయితే, మరొకరు డీఫ్యాక్టో సీఎం. వీరు ప్రజా సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. లిక్కర్ కేసులో అరెస్టులు ఎందుకు చేస్తున్నారు.. స్కాం ఎక్కడ జరిగిందో చెప్పాలి కదా. లిక్కర్ స్కాంలో అసలు దొంగ చంద్రబాబే. 2019-2024 మద్యం స్కాం జరగలేదు. 2014-2019 మధ్య జరిగింది అసలైన లిక్కర్ స్కాం. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి చంద్రబాబు గండి కొట్టారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తెచ్చిన లిక్కర్ పాలసీలో ప్రభుత్వ ఆదాయం పెరిగింది. కూటమి ప్రభుత్వం తెచ్చిన లిక్కర్ పాలసీలో ప్రభుత్వ ఆదాయం పెరిగిందా?. లిక్కర్ డోర్ డెలివరీ చేసి బలవంతం తాగించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. 11 కోట్లు సీజ్ చేశారు.. అవి ఎవరివి?. అతని స్టేట్మెంట్ ఏమైనా రికార్డ్ చేశారా?. కేసిరెడ్డి ఎన్నికల ముందు డబ్బు దాస్తే ఇంతకాలం అలాగే అక్కడే ఉంటుందా?. లిక్కర్ స్కాం జరగలేదు మిథున్ రెడ్డి ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదు. నెల్లూరు ఏమైనా కంచుకోటా.. కంచె వేసి అడ్డుకోవడం ఏమిటి?. మెయిల్స్ చేసి అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు. మీ మాదిరి దిగజారి వ్యవహరించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు మేనేజ్ మెంట్ స్కిల్స్ ముందు మేం సరితూగం’ అని కామెంట్స్ చేశారు.