
సాక్షి చిత్తూరు: ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుది అని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన మోసాలు ప్రతీ గ్రామానికి తీసుకుని వెళ్ళాలి అని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు మున్సిపాలిటీ, పుంగనూరు, చౌడేపల్లె, సోమల మండలాల్లో వైఎస్సార్‌సీపీ అధినేత, వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమం వైఎస్సార్‌సీపీ చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ..‘చంద్రబాబు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ మాత్రమే కాకుండా 143 హామీలు ఇచ్చారు. ప్రతీ ఇంటికి ఇంత ఇస్తాం.. అంత ఇస్తాం అని టీడీపీ ప్రచారం చేసింది. వాటితో పాటుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలు పెట్టి బాండ్లు ఇచ్చారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన మోసాలు ప్రతీ గ్రామానికి తీసుకుని వెళ్ళాలి. ప్రతీ ఇంటికి వీరి మోసాలు తెలియాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదు. వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారు. కరోనా సమయంలో కూడా ఎక్కడా వైఎస్ జగన్ వెనకడుగు వేయలేదు. కానీ, కూటమి ప్రభుత్వం ఏడాదిలోపు చెడ్డ పేరు తెచ్చుకుంది. మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుది. గతంలో రామారావును వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన వెంటనే చంద్రబాబు మద్యపాన నిషేధాన్ని ఎత్తేశారు. కరెంట్ ఛార్జీలు పెంచమని రామారావు హామీ ఇస్తే.. ఆ మాటను కూడా తుంగలో తొక్కి ఐదుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు.
2014లో కూడా అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇచ్చిన హామీలు పక్కన పెడుతున్నారు. తల్లికి వందనానికి 13వేల కోట్లు అవసరమైతే కేవలం ఎనిమిది వేల కోట్లు మాత్రమే నిధులు కేటాయించారు. ఇక ఉచిత బస్సు అని చెప్పి అది స్థానికంగా మాత్రమే అని మెలికలు పెట్టారు.. అది కూడా ఇంకా అమలు కాలేదు. ఇవన్నీ కూడా మీరు ప్రజలకు గ్రామ గ్రామానా వివరించాలి’ అని పిలుపునిచ్చారు.