హామీలు నెరవేర్చకుంటే చలో విజయవాడ
చిత్తూరు కలెక్టరేట్ : చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే చలో విజయవాడ ఖాయమని ఎస్‌టీయూ రాష్ట్ర నాయకులు గంటా మోహన్, జిల్లా అధ్యక్షుడు మదన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు డిమాండ్‌ల పరిష్కారం కోసం ఈ నెల 13వ తేదీన ఆ సంఘం నాయకులు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. కలెక్టరేట్ వద్ద ధర్నా చేసేందుకు ప్రయత్నించిన టీచర్లపై పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారు. కలెక్టరేట్ వద్ద ధర్నా చేసేందుకు వీల్లేదని టెంట్‌ను తొలగించారు. దీంతో సంఘ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు బెదిరింపులకు పాల్పడడం దారుణమని ఎస్‌టీయూ నాయకులు మండిపడ్డారు. అనంతరం జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేసుకోవాలని చెప్పడంతో ఆ సంఘ నాయకులు ధర్నా నిర్వహించారు. గాంధీ విగ్రహం వద్ద వందలాది మంది టీచర్‌లు రోడ్డు పై బైఠాయించి చంద్రబాబు సర్కారు తీరు పై నినాదాలు చేసి విమర్శలు గుప్పించారు.
బతుకు భారంపై ఆవేదన
ఎస్టీయూ జిల్లా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మదన్‌మోహన్‌రెడ్డి, షేక్ ఇలియాజ్ మాట్లాడుతూ సుమారు 35 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం కావాలనే తొక్కి పెడుతోందని ఆరోపించారు. సీపీఎస్ విధానం రద్దు చేసి వెంటనే పాత పెన్షన్ అమలు చేయాలన్నారు. ఈ నెల 25వ తేదీ లోపు ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోతే వేలాది మందితో చలో విజయవాడ చేపట్టి దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అనంతరం డీఆర్‌ఓ మోహన్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో రాష్ట్ర అదనపు కార్యదర్శి పురుషోత్తం, నాయకులు దేవరాజులురెడ్డి, రాధాకుమారి, ప్రమీలకుమారి, వేదవతి, యువరాజు, పురుషోత్తం, చంద్రశేఖర్, రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల గర్జన
చంద్రబాబు సర్కారు తీరు మార్చుకోవాలని ఎస్‌టీయూ రాష్ట్ర నాయకులు గంటా మోహన్ హెచ్చరించారు. టీచర్లకు ఇచ్చిన హామీలను గాలికొదిలేయడం దారుణమని ధ్వజమెత్తారు. వెంటనే 30 శాతం ఐఆర్ ప్రకటించాల్సిందేనని అల్టిమేటం జారీచేశారు. తక్షణమే 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
హామీలు నెరవేర్చకుంటే చలో విజయవాడ


