రైతు భరోసా కేంద్రాల్లో
మందుల కొరత
అల్లాడుతున్న పశువులు
అవస్థల్లో పశుపోషకులు
నోరులేని మూగ జీవాలతో కూటమి ప్రభుత్వం చెలగాట మాడుతోంది. వాటికి అవసరమైన మందులు పంపిణీ చేయకుండా వేధిస్తోంది. రైతు భరోసా కేంద్రాల్లో కనీసం మందులు, మాత్రలు కూడా లేకుండా చేసింది. జ్వరం, ఇతర ఇన్ఫెక్షన్లు వస్తే పెంపకందారులు ప్రయివేటు మందుల దుకాణ దారులను ఆశ్రయించాల్సి వస్తోంది. సకాలంలో మందులు అందక కొన్ని మృత్యువాత పడుతుండడం విమర్శలకు తావిస్తోంది.
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో పశుసంవర్థక శాఖ తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అండగా నిలవాల్సిన రైతు భరోసా కేంద్రా లు మందుల లేమితో నిర్వీర్యంగా మారా యి. పశువులు వ్యాధులతో అల్లాడుతుండ గా, పశుపోషకులు తీవ్ర ఆందోళనకు గురవు తున్నారు. కనీస ఔషధాలు కూడా అందుబాటులో లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.
జిల్లాలో ఇదీ పరిస్థితి
జిల్లాలోని పలు మండలాల్లో పశువులు జ్వరం, ఇన్ఫెక్షన్లు, గాయాలు, జీర్ణ సమస్యలతో బాధపడుతున్నాయి. రైతు భరోసా కేంద్రాల్లో అవసరమైన మందులు లేక ప్రైవేట్ మెడికల్ దుకాణాల వైపు రైతులు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా జ్వరం, నొప్పి తగ్గించే ఇంజెక్షన్లు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు ఉపయోగించే యాంటీబయోటిక్స్, కమి నివారణ మందులు వంటి ప్రాథమిక ఔషధాలు దాదాపు అందుబాటులో లేవు.
పశుప్రాణాలకు ముప్పు
పశువులకు గాయాలు కావడం గ్రామీణ ప్రాంతాల్లో సాధారణం. వాటికి సరైన చికిత్స అందకపోవడం ఇప్పుడు పెద్ద ప్రమాదంగా మారింది. గాయాలను శుభ్రపరచడానికి అవసరమైన ద్రావణాలు, డ్రెస్సింగ్‌కు ఉపయోగించే ఆయింట్మెంట్లు, స్ప్రేలు కేంద్రాల్లో లేవు. చిన్న గాయాలు కూడా ఇన్ఫెక్షన్లకు దారితీస్తున్నాయి.
పరికరాలు ఏవీ?
మందుల కొరతతో పాటు ప్రాథమిక పరికరాల లేమి కూడా పరిస్థితిని మరింత విషమం చేస్తోంది. పశువుల శరీర ఉష్ణోగ్రతను పరీక్షించడానికి థర్మామీటర్లు, ఇంజెక్షన్లు ఇవ్వడానికి సిరింజ్‌లు, చికిత్స సమయంలో అవసరమైన గ్లవ్స్, గాజ్ వంటి సామగ్రి కూడా అనేక కేంద్రాల్లో అందుబాటులో లేవు. దీంతో ఫీల్డ్ స్థాయిలో పశు వైద్య సేవలు దాదాపు నిలిచిపోయినట్లే.
పాల ఉత్పత్తిపై దెబ్బ
ఇక పాల ఉత్పత్తిపై కూడా ఈ పరిస్థితి తీవ్ర ప్రభావం చూపుతోంది. కాల్షియం, మినరల్ మిశ్రమాలు, విటమిన్ ఇంజెక్షన్లు అందుబాటులో లేకపోవడంతో పశువులు బలహీనంగా మారి పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతోంది. జిల్లా పాల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితి కొనసాగితే రైతుల ఆదాయంపై భారీ దెబ్బ పడే అవకాశముంది.
వ్యాధులు అధికం
పశువుల్లో కడుపులో పురుగుల సమస్యలు పెరుగుతున్నాయి. దీనివల్ల పశువులు ఆహారం తినకపోవడం, బరువు తగ్గడం, పాల ఉత్పత్తి తగ్గడం వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. జీర్ణ సమస్యలు, గ్యాస్, డయేరియా కేసులు కూడా పెరుగుతున్నాయి. కానీ వీటికి అవసరమైన టానిక్స్, ప్రోబయోటిక్స్, ఫ్లూయిడ్స్ అందుబాటులో లేవు.
జిల్లా సమాచారం
రైతు భరోసా కేంద్రాలు 297
ఆవులు, గేదెల సంఖ్య 4.68
గొర్రెలు 5,01,947
మేకలు 2,08,149
పందులు 386
సంక్షోభంలో పశువైద్యం
పట్టించుకోరా?
మందుల కొరతపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన రాకపోవడంతో పశుపోషకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘పశువులే మా జీవనాధారంం అవి అనారోగ్యానికి గురైతే మేమెలా బతుకుతాం?’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలు రైతులకు అండగా నిలవాల్సిన సమయంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం బాధాకరమని అంటున్నారు. వెంటనే చర్యలు తీసుకుని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో అవసరమైన పశువైద్య మందులు, పరికరాలు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని పశుపోషకులు కోరుతున్నారు.


