ఆదుకోరేం! | - | Sakshi
Sakshi News home page

ఆదుకోరేం!

Apr 4 2026 7:43 AM | Updated on Apr 4 2026 7:43 AM

తరుముకొస్తున్న నీటి కష్టాలు అవస్థల్లో రైతన్నలు నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం

కష్టాల్లో ఉన్నాం..

పుట్టెడు కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాం. యుద్ధం పేరుతో ధరల సెగ చెమటలు పట్టిస్తోంది. గ్యాస్‌ కష్టాలతో అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోవడంతో ఉచిత వైద్యం అటకెక్కింది. రోజురోజుకీ పెరుగుతున్న ఎండలతో నీటి సమస్య తరుముకొస్తోంది. నిబంధనల మేరకు బిల్లులు కట్టినా కొత్త కరెంట్‌ కనెక్షన్‌ అందని ద్రాక్షగానే మారుతోంది. కోటి ఆశలతో వేరుశనగ వేసినా గిట్టుబాటు ధర అంతంతమాత్రంగానే దక్కుతోంది. గత ప్రభుత్వంలో పలు భవనాలు నిర్మించినా ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని గాలికొదిలేశారు. టీడీ బకాయిలు పేరుకుపోతున్నాయి. వీటిని పరిష్కరించాల్సిన అధికారులు పట్టీపటనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ జెడ్పీ సమావేశంలోనైనా మా కష్టాలపై చర్చిస్తారో లేదోనని ఎదురుచూస్తున్నాంశ్రీ అని అంటున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు. నేడు జరిగే సమావేశంలో సమస్యల పరిష్కారం దిశగా ప్రజాప్రతినిధులు.. అధికారులు అడుగులు వేయాలని కోరుతున్నారు.

రైతన్నల కష్టాలు

జిల్లాలో వేరుశనగ పంట 9వేల హెక్టార్లలో నష్టం జరగగా వాటికి అంచనా విలువ రూ.15.42 కోట్లు వేశారు. దీని కోసం 24,342 మంది రైతులు ఎదురు చూస్తున్నారు. జిల్లాలో 14వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా.. దీన్ని భర్తీ చేయాలని రైతులు కోరుకుంటున్నారు. పాడి పరిశ్రమ సంక్షోభంలో ఉంది. పశుగ్రాసం కొరత త్రీవంగా ఉంది. పశువులకు తాగునీరు అందక అల్లాడుతున్నాయి. మామిడి సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో బకాయిల కోసం రైతులు ఆందోళన బాట పట్టారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు ఆశించిన విధంగా సాగడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు.

చిత్తూరు కార్పొరేషన్‌: ఉమ్మడి చిత్తూరు జిల్లా సమస్యల వలయంలో చిక్కుకుపోయింది. ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోతున్నాయి. వీటిని పరిష్కరించాల్సిన ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధికారులు సైతం తమకెందుకులే అన్న ధోరణితో వ్యవహరించడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు కష్టాల్లో కూరుకుపోవాల్సి వస్తోంది. నేడు జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశంలోనైనా సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఆగిన ఆరోగ్యశ్రీ

జిల్లాలో ఆరోగ్యశ్రీ కష్టతరంగా మారింది. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో రూ.200 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. దీంతో వైద్యం చేయలేం బాబోయ్‌ అంటూ ఆయా ఆస్పత్రులు చేతులెత్తేశాయి.

టీడీ బకాయిలు రూ.10 కోట్లు

జిల్లాలో గత రెండేళ్లుగా మున్సిపాలిటీలో పంచాయతీలు మండలాలకు చెల్లించాల్సిన ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ పెండింగ్‌ రూ.10 కోట్లకు పైగా ఉంది. రెండేళ్లుగా జమ కాకపోవడంతో స్థానిక సంస్థల్లో అభివృద్ధి కుంటుపడుతోంది.

అధ్వాన్నం

జెడ్పీ కార్యాలయ పరిధిలో అవసరం లేకున్నా రూ.కోట్లలో పలు పనులను నామినేట్‌ పద్ధతిలో కూటమి నేతకు కట్టబెట్టారు. ఇందులో చాలా పనులు అధ్వాన్నంగా.. నాసిరకంగా ఉన్నా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. జెడ్పీ కార్యాలయ భవనాలకు వేసిన పెయింటింగ్‌ పెచ్చులూడిపోయింది. సమావేశ మందిరంలో టాయ్‌లెట్స్‌ నిర్వహణ అధ్వాన్నంగా ఉంది.

కరెంటు కష్టాలు తీరేనా?

జిల్లాలో 2 వేలకు పైగా పైకం చెల్లించిన వ్యవసాయ సర్వీసులు అలానే పెండింగ్‌లో ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ట్రాన్స్‌ఫార్మర్ల కోనుగోలుకు అధిక మొత్తం చెల్లించి కాంట్రాక్టర్‌కు దోచిపెడుతున్నారని టీడీపీ నాయకులు గగ్గోలు పెట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక అదే కాంట్రాక్టర్‌కు అదే మొత్తంతోనే అదనంగా ట్రాన్స్‌ఫార్మర్లు కోనుగోలు చేయిస్తున్నారు. విద్యుత్‌ మీటర్‌ రీడర్స్‌ జిల్లాలో 200 మందికి పైగా ఉన్నారు. వీరికి ఒక నెల వేతనం కాంట్రాక్టర్ల దగ్గర పెట్టుకొని మరుసటి నెల నుంచి చెల్లిస్తున్నారు. ీపీఎం కుసుం కింద సోలార్‌ ప్లాంట్స్‌ ఏర్పాటు ముందుకు సాగడం లేదు. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత సౌర ఫలకాల ఏర్పాటు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది.

గ్యాస్‌తో యుద్ధం

యుద్ధం కారణంగా జిల్లాలో గ్యాస్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. ఓటీపీ లేకుండానే ఏజెన్సీలు అమ్మకాలు జోరుగా సాగిస్తున్నాయి. ఓ వైపు గ్యాస్‌ కొరత కారణంగా హోటల్స్‌, టీస్టాల్స్‌ మూతపడుతున్నాయి. కొన్ని దుకాణాలు అమాంతంగా ధరలు పెంచేశాయి. భోజనం చేయాలంటే సామాన్యుడు లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నీటి ఎద్దడి

జిల్లాలో వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో తాగునీటి సమస్య రోజురోజుకూ త్రీవ రూపం దాల్చుతోంది. జిల్లాకు ప్రతిపాదించిన వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టుకు ఆమోదం లభించ లేదు. హంద్రీ–నీవా, గాలేరు –నగరి ప్రాజెక్టు పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. కుప్పం నియోజకవర్గంలో మాత్రమే నీటి సమస్య రాకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

జెడ్పీ కార్యాలయం

ఆ భవనాలపైనే కక్ష

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సచివాలయాలు, ఆర్‌బీకేలు, వెల్‌నెస్‌ సెంటర్లు 1,381 భవనాలను మంజూరు చేసింది. ఇందులో సచివాలయానికి రూ.40 లక్షలు, ఆర్‌బీకేలకు రూ.21.80 లక్షలు, వెల్‌నెస్‌ సెంటర్‌కు రూ.20.80 లక్షలు చొప్పున మంజూరు చేశారు. జిల్లాలో సచివాలయాలు 335, ఆర్‌బీకేలు 340, వెల్‌నెస్‌ సెంటర్లు 159 చొప్పున మొత్తం 834 భవనాలు నిర్మించారు. వీటి కోసం రూ.241 కోట్లు ఖర్చుపెట్టారు. ఇంకా పలు దశల్లో, ప్రారంభం కాని భవనాలు మొత్తం 547 వరకు ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.152 కోట్లు. వీటిని కూటమి ప్రభుత్వం వచ్చాక పట్టించుకోలేదు.

రూ.100 కోట్ల బిల్లులు పెండింగ్‌

గత ఏడాది కాలంగా జిల్లాలో పంచాయతీరాజ్‌ పరిధిలో దాదాపు 90 కి.మీ వరకు సీసీ, బీటీ రోడ్లు, కాంపౌండ్‌ వాల్స్‌ నిర్మించారు. ఇందుకు సంబంధించి రూ.100 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో .ఉన్నాయి.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సవాలక్ష సమస్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement