విద్యుత్‌ సమస్యలు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సమస్యలు పరిష్కారం

Feb 14 2026 7:55 AM | Updated on Feb 14 2026 7:55 AM

విద్య

విద్యుత్‌ సమస్యలు పరిష్కారం

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లాలో శుక్రవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని 40 సెక్షన్లలో అధికారులు, సిబ్బంది పర్యటించి, సమస్యలను గుర్తించారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్లలో 72 సమస్యలు, ట్రాన్స్‌ఫార్మర్లలో 22, ఎల్‌టీ లైన్లలో 163, సర్వీసు లైన్‌లో 15 కలిపి మొత్తం 272 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్‌ అహ్మద్‌ తెలిపారు. వాటిలో 18 సమస్యలను పరిష్కారించామన్నారు. మిగిలినవి ఉన్నతాధికారుల అనుమతి తీసుకొని పరిష్కరించనున్నట్లు వివరించారు.

కుప్పంలో పాల కల్తీ లేదు

కుప్పం: కుప్పం ప్రాంతంలో పాల కల్తీ ఎక్కడా జరగలేదని, ఈ వ్యవహారం అంతా కర్ణాటకకు సంబంధించిందిగా కుప్పం డీఎస్పీ పార్థసారధి తెలిపారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. కుప్పం ప్రాతంలో కల్తీ పాలు విక్రయిస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. కుప్పం ప్రాంతంలో పాల కల్తీ జరగలేదని, కర్ణాటక రాష్ట్రం కేజీఎఫ్‌ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఆ రాష్ట్రంలోని బల్లగిరి గ్రామంలో జరిగిన దాడుల్లో కొందరిని అదుపులోకి తీసుకున్నారన్నారు. వీరిలో రామకుప్పం మండలానికి చెందిన బాలరాజు, గుడుపల్లెకు చెందిన వెంకటేష్‌, బాలాజీ, దిలీప్‌పై కేసులు నమోదు చేశారని తెలిపారు. వీరంతా కర్ణాటకలోని బల్లగిరి వద్ద పాలు కల్తీకి పాల్పడ్డారని కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. కర్ణాటకలో జరిగిన సంఘటనలో కుప్పంవాసులు ఉండడంతో ఈ వార్తలు వస్తున్నాయన్నారు. కల్తీ జరిగింది కుప్పంలో మాత్రం కాదని స్పష్టం చేశారు.

పరీక్షలపై సీఎస్‌ సమీక్ష

చిత్తూరు కలెక్టరేట్‌: పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు కలెక్టరేట్‌ నుంచి జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన్‌, డీఆర్‌ఓ మోహన్‌కుమార్‌ పాల్గొన్నారు. పరీక్షల నిర్వహణతోపాటు, కోర్టు భవనాలకు స్థల కేటాయింపులు, ప్రభుత్వ కార్యాలయాల స్థల సమస్యలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పది, ఇంటర్మీడియట్‌ పరీక్షలకు చేసిన ఏర్పాట్లను జాయింట్‌ కలెక్టర్‌ వివరించారు.

పెనుమూరు పీడీపై సస్పెన్షన్‌ వేటు

చిత్తూరు కలెక్టరేట్‌: జిల్లాలోని పెనుమూరు మండలంలో విద్యార్థిని వేధింపుల ఘటనలో పెనుమూరు జెడ్పీ హైస్కూల్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌పై వేటు పడింది. ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినితో పీడీ అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆయనను సస్పెండ్‌ చేస్తూ డీఈఓ రాజేంద్రప్రసాద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల మేరకు పెనుమూరు జెడ్పీ హైస్కూల్‌ పీడీ చంద్రశేఖర్‌ గత ఏడాది మే నెలలో ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించారు. రాష్ట్ర హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌(హెచ్‌ఆర్‌డీ)లోని ప్రజాసమస్యల పరిష్కార వేదికను బాధితులు ఆశ్రయించారు. దీనిపై స్పందించిన రాష్ట్ర విద్యాశాఖ సమగ్ర విచారణ చేయాలంటూ చిత్తూరు డీఈఓను ఆదేశించింది. విచారణాధికారి చిత్తూరు డీవైఈఓ ఇందిరను ప్రాథమిక విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. దీని ఆధారంగా పీడీను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

పరీక్ష సమయంలో పార పట్టించారు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): అసలే పరీక్ష సమయం. విద్యార్థులు పుస్తకాలు పట్టి కుస్తీ పట్టాల్సిన తరుణం. అయితే పార పట్టి పనులు చేయించారు. చిత్తూరు మండలం బీఎన్‌ఆర్‌ పేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోని విద్యార్థులకు శుక్రవారం ఆ కళాశాల అధ్యాపకులు గట్టి పని పెట్టారు. గడ్డపార, పార ఇచ్చి పరీక్ష పెట్టారు. కళాశాల ముఖ ద్వారం ఆనుకుని కళాశాల ఆవరణంలో ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు, గడ్డిని తొలగించేలా చేశారు. సుమారు 3 గంటల పాటు పనులు చేయించారు.

విద్యుత్‌ సమస్యలు పరిష్కారం 
1
1/2

విద్యుత్‌ సమస్యలు పరిష్కారం

విద్యుత్‌ సమస్యలు పరిష్కారం 
2
2/2

విద్యుత్‌ సమస్యలు పరిష్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement