అంతా.. ఇంతా కాదు | - | Sakshi
Sakshi News home page

అంతా.. ఇంతా కాదు

Feb 14 2026 7:55 AM | Updated on Feb 14 2026 7:55 AM

అంతా.

అంతా.. ఇంతా కాదు

జిల్లాలో అనుమతిల్లేని ప్రైవేటు ఆస్పత్రులు ఈ ఆస్పత్రుల్లో చేరితే ప్రాణాలకు ముప్పు ఇష్టారాజ్యంగా వైద్య సేవల ఫీజులు రిజిస్ట్రేషన్‌ లేని ఆస్పత్రుల్లో డమ్మీ డాక్టర్లు, సిబ్బంది పట్టించుకోని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు

జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రులు ఇబ్బడి ముబ్బడిగా

వెలుస్తున్నాయి. సందుకో ఆస్పత్రి పురుడు

పోసుకుంటోంది. అనుమతి లేకుండానే దర్జాగా

క్లినిక్‌ల పేరుతో ఆస్పత్రులు తెరుచుకుంటున్నాయి.

అడిగేవారు లేరని.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పలు చోట్ల డమ్మీ డాక్టర్లు, సిబ్బందితో దోపిడీ

చేస్తున్నాయి. ఈ ఆస్పత్రుల్లో చేరి పడకెక్కితే

పరలోకానికి పయనమేనని ఆరోపణలున్నాయి.

అయినా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు

పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

కాణిపాకం : జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రులు 154 వరకు రిజిస్టర్‌ అయ్యాయి. ఇందులో హాస్పిటల్స్‌ 95, డెంటల్‌ క్లినిక్‌లు 15, క్లినిక్‌లు 23, ఇతర క్లినిక్‌లు 21 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాయి. అనుమతులు లేకుండా దాదాపు 300 పైగా క్లినిక్‌లు, ఆస్పత్రులు అనుమతుల్లేకుండా నడుస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల అంచనా. ఇవన్నీ కూడా ఏళ్ల తరబడి నడుస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. అరకొర వైద్యం అందించే డాక్టర్లు, సిబ్బందితో వైద్య వ్యవస్థను కలుషితం చేస్తున్నారు. హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు తెప్పిస్తున్నారు. ఇక గడువు ముగిసిన ఆస్పత్రులు కూడా 30కి పైగానే ఉన్నాయి. ఇవి కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. రూ.లక్షల్లో ఆదాయం వచ్చే ఆస్పత్రులు కూడా రిజిస్ట్రేషన్‌ చేసేందుకు వెనకడుగు వేస్తున్నాయి. ప్రస్తుత ప్రజాప్రతినిధుల అండతో రెచ్చిపోతున్నాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు బోరుమంటున్నారు.

తప్పనిసరి అనుమతులు

ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లు లేబోరేటరీలు, డెంటల్‌ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్లు, ఫిజియోథెరపీ యూనిట్ల ఏర్పాటు చేయాలంటే వివిధ విభాగాల నుంచి అనుమతులు తప్పనిసరి. వీటిని ఏర్పాటు చేసే భవనాలకు పట్టణ, పంచాయతీ అనుమతులు, అగ్నిమాపక శాఖ, ఐఎంఏ సభ్యత్వం, వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది, వైద్య పరీక్షల సామగ్రి వివరాలు, కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతి, స్పెషలిస్టు వైద్యులు, నర్సులు, ఫార్మసీ సిబ్బంది, ఆడిట్‌ నివేదిక ఇలా అన్ని రకాల అనుమతులతో రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

ఫీజులు

ప్రైవేటు ఆస్పత్రులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే వేలల్లోనే ఫీజులుంటాయి. సాధారణ క్లినిక్‌లు రూ.1250, పాలి క్లినిక్‌లకు రూ.2500, 20 పడకల ఉన్న ఆస్పత్రికి రూ.3750, 21 నుంచి 50 పడకల ఆస్పత్రికి రూ.7500, 50 నుంచి 100 పడకల ఆస్పత్రికి రూ.10 వేలు, 101 నుంచి 200 పడకలకు రూ.15 వేలు, 200 పైగా పడకలున్న ఆస్పత్రికి రూ.37,500, ల్యాబోరేటరీకి రూ.2500, డయాగ్నోస్టిక్‌ సెంటర్‌, ఎక్స్‌రే, సీటీ స్కాన్‌ సెంటర్‌లకు రూ.10 వేలు, ఫిజియోథెరపీ క్లినిక్‌కు రూ.3750 ఫీజు చెల్లించాల్సి ఉంది. అయితే ఆ రకంగా పలు ప్రైవేటు హాస్పిటల్స్‌, క్లినిక్కులు రిజిస్ట్రేషన్‌కు ముందుకు రాకపోవడానికి పలు కారణాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఇదే సాక్ష్యం

చిత్తూరు నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయానికి సమీపంలోని మూడు ఆస్పత్రులకు అనుమతి లేదు. ఇందులో ఒక చిన్న పిల్లల ఆస్పత్రి కూడా ఉంది. ఈ మూడు ఆస్పత్రులకు రోజువారీగా రూ.లక్షల్లో ఫీజులొస్తుంటాయి. ఇక మెడికల్‌ షాపులు కూడా వీరే నిర్వర్తించడంతో రూ.3 లక్షల వరకు ఆదాయం ఉంటుందని అంచనా. ఇక ఈ ఆస్పత్రుల్లో వైద్యార్హత లేని డాక్టర్లు, సిబ్బంది చికిత్స చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని మరో ఆస్పత్రి కొత్తగా పురుడు పోసుకుంది. ఆ ఆస్పత్రి సకల సౌకర్యాలతో నడుస్తున్నా ఇంత వరకు అనుమతి పొందలేదు. ఈ విషయం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

చిత్తూరు సుందరయ్యవీధిలో ఓ డెంటల్‌ ఆస్పత్రికి కొన్నేళ్లుగా అనుమతి లేకుండానే నడుస్తోంది. 2014 జూలైలో అప్పటి డీఎంఅండ్‌హెచ్‌ఓ ఆ బోగస్‌ ఆస్పత్రిని గుర్తించారు. రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని నోటీసులు కూడా ఇచ్చారు. కానీ ఇంత వరకు రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేదని కార్యాలయ అధికారులే చెబుతున్నారు.

ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఆస్పత్రులకు రిజిస్ట్రేషన్‌ చేయిస్తామంటే.. విధిగా చేయించుకునేవాళ్లు వందల సంఖ్యలో ఉన్నామని రిజిస్ట్రేషన్‌ కాని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. రిజిస్ట్రేషన్‌ కోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి వెళితే రూ. లక్షల్లో ఖర్చు అవుతోందని పలువురు వాపోతున్నారు. ఒక్కో ఆస్పత్రికి రూ.80 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. కార్యాలయంలో మధ్యవర్తులుగా వ్యవహరించే కొందరి చేతిలో పైసలు పెడితే తప్ప పనులు జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇక అనుమతులు లేని పలు ఆస్పత్రుల నుంచి మామూళ్లు ముడుతున్నాయనే ఆరోపణలున్నాయి. అందుకే ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ విషయాన్ని పక్కన పెట్టేస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి.. మధ్యవర్తుల జోక్యాన్ని కట్టడి చేసి.. ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ను నియమ నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలని అంతా డిమాండ్‌ చేస్తున్నారు.

అంతా.. ఇంతా కాదు 1
1/3

అంతా.. ఇంతా కాదు

అంతా.. ఇంతా కాదు 2
2/3

అంతా.. ఇంతా కాదు

అంతా.. ఇంతా కాదు 3
3/3

అంతా.. ఇంతా కాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement