
సాక్షి, తాడేపల్లి: దివంగత మహానేత వైఎస్సార్ రెండు తెలుగు రాష్ట్రాల రైతుల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి. ప్రజలకు మేలైన సంక్షేమం అందించారు కాబట్టే వైఎస్సార్ అందరి గుండెల్లో నిలిచిపోయారు. తండ్రి పాలనను మరిపించేలా సంక్షేమం అందించిన నాయకుడు వైఎస్ జగన్ అని సుబ్బారెడ్డి కొనియాడారు. రైతే రాజులా ఉండాలని వైఎస్సార్, జగన్ పాలన అందించారని చెప్పుకొచ్చారు.
వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..‘దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనంత మంచి చేసిన నాయకుడు వైఎస్సార్. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా భావించి పాలన అందించారు. ఉచిత విద్యుత్‌తో ఎంతో మంది రైతులు మేలు పొందారు. రెండు తెలుగు రాష్ట్రాల రైతుల గుండెల్లో వైఎస్సార్ నిలిచిపోయారు. పేదవాడికి విద్య, వైద్యం అందుబాటులోకి తెచ్చింది వైఎస్సార్. దేశంలోనే ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.
ఫీజురీయింబర్స్‌మెంట్ వల్ల ఎంతో మంది విద్యావంతులయ్యారు.. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రజలకు మేలైన సంక్షేమం అందించారు కాబట్టే వైఎస్సార్ అందరి గుండెల్లో నిలిచిపోయారు. రెండు పర్యాయాలు కాంగ్రెస్‌ను జాతీయ స్థాయిలో నిలబెట్టింది వైఎస్సార్. ఆయన ఆశయాల సాధన కోసం ఏర్పాటైన పార్టీ వైఎస్సార్‌సీపీ. తండ్రి పాలనను మరిపించేలా సంక్షేమం అందించిన నాయకుడు వైఎస్ జగన్. తండ్రి నాలుగు అడుగులు వేస్తే కొడుకుగా జగన్ 10 అడుగులు ముందుకు వేశారు. విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అందరికీ మెరుగైన వైద్యం అందించాలని మెడికల్ కాలేజీలను తెచ్చారు
రైతే రాజులా ఉండాలని వైఎస్సార్, జగన్ పాలన అందించారు. కూటమి పాలనలో అరాచకం కొనసాగుతోంది. కక్ష సాధింపుకే అధికారాన్ని వాడుకుంటున్నారు. అన్ని వర్గాల వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కూటమి అరాచకాలను తిప్పికొట్టేలా పోరాడుదాం. మళ్లీ వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తెచ్చుకుందాం’ అని పిలుపునిచ్చారు.
