ప్రత్యేక హోదా, మూడు రాజధానులపై కుండబద్దలు కొట్టిన వైఎస్సార్‌సీపీ

Ysrcp Mp Vijaya Sai Reddy Strait Question Center Ap Special Status - Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో రెండు ప్రశ్నలకు గట్టి జవాబే ఇచ్చినట్లనిపిస్తుంది. ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో చేసిన ప్రసంగం ఆ విషయాన్ని స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా అంశంతో పాటు, మూడు రాజధానుల గురించి ఆయన మాట్లాడిన తీరు గమనించాల్సిందే. ప్రత్యేక హోదాకు సంబంధించి భారతీయ జనతా పార్టీని కూడా ఆయన ఏకిపారేశారు. వామపక్షాలు తరచూ ఈ మధ్య టిీడీపీ జోలికి పోకుండా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తున్నాయి. బీజేపీకి వైసీపీ భయపడిపోతోందని వారు అంటుంటారు. అందుకే ప్రత్యేక హోదా గురించి నిలదీయడం లేదని వారు ఆరోపిస్తుంటారు.

టీడీపీ వారు బీజేపీని ఒక్క మాట అనకపోయినా వామపక్షాలు ముఖ్యంగా సీపీఐ మాత్రం ఆ పార్టినీ తప్పుపట్టకుండా, ఎలాగోలా ఆ పార్టీ పంచన చేరాలని ప్రయత్నిస్తోందన్న అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో విజయసాయి పార్లమెంటులో మాట్లాడుతూ బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు ఆ రోజుల్లో ఏపీకి పదేళ్ల ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన వాగ్ధానాన్ని అమలు చేయడం లేదని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ,బీజేపీలు విభజన చట్టంలోని హామీలు అమలు చేయడంలో విఫలం అయ్యాయని, తత్పలితంగానే ఈ రెండు పార్టీలకు ఏపీలో జీరో ఫలితాలు వచ్చాయని ఆయన ఎద్దేవా చేశారు.

ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం అని బీజేపీ అంటున్నదని, కానీ అది ఎప్పటికీ ముగియదని, ప్రత్యేక హోదా సాధించేవరకు తమ పోరాటం ఆగదని విజయసాయి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నారు. ప్రధాని మోదీని కానీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కానీ కలిసి వినతిపత్రాలు ఇచ్చే సందర్భంలోను కచ్చితంగా ప్రత్యేక హోదా ఒక పాయింట్ గా ఉంటోంది.
చదవండి: సెస్సులు, సర్‌చార్జీల్లో రాష్ట్రాలకు వాటా లేదు: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌

అయినా ఏపీలో ప్రతిపక్షం వైసీపీపై దాడి చేస్తుంటుంది. చిత్రంగా బీజేపీని ఒక్క మాట అనని టీడీపీ కూడా వైఎస్సార్‌సీపీనే తప్పుపడుతూ ప్రత్యేక హోదా సాధనలో విఫలం చెందిందని అంటుంది. విశేషం ఏమిటంటే అసలు ప్రత్యేక హోదాపై పలు రకాలుగా మాటలు మార్చింది తెలుగుదేశం పార్టీనే. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు బాధ్యతలను తమకు అప్పగించాక , ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోదా బదులు ప్యాకేజీకి అంగీకరించారు. దానిపై ప్రజలు తీవ్రంగా స్పందించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు. దాంతో భయపడి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ తన మాట మార్చుకుని ప్రత్యేక హోదా పాట పాడసాగారు.

కానీ వైఎస్సార్‌సీపీ మాత్రం ఒకే మాట మీద నిలబడుతోంది. అందులో భాగంగానే విజయసాయి రెడ్డి పార్లమెంటులో ఘాటుగానే స్పీచ్ ఇచ్చారు. ఇక మూడు రాజధానుల విషయంలో న్యాయ వ్యవస్థను ఆయన ధైర్యంగా తప్పుపట్టారు. పలు రాష్ట్రాలలో రెండు రాజధానులు ఉన్న సంగతిని గుర్తు చేస్తూ, ఏపీకి ఎందుకు ఒప్పుకోరని ఆయన ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థ తన పరిధి అధిగమించి తీర్పు ఇచ్చిందని ఆయన ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాజధాని అన్నది రాష్ట్రాలకు సంబంధించిన అంశమని స్పష్టంగా చెప్పినా, న్యాయ వ్యవస్థ భిన్నమైన తీర్పు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.

అన్ని ప్రాంతాల సమాన అభివృద్ది కోసం తీసుకున్న ఈ నిర్ణయంపై కోర్టు ఇచ్చిన తీర్పు ఏపీపై వివక్ష చూపుతున్నట్లుగా ఉందని కూడా విజయసాయి వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు రాబోతున్న తరుణంలో వైఎస్సార్‌సీపీ తన అభిప్రాయాన్ని మరోసారి కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడిందని చెప్పవచ్చు. ఈ విధంగా వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ తను ఈ రెండు విషయాలలో ఎక్కడా రాజీపడలేదని రుజువు చేసుకుందని అనుకోవచ్చు!
-హితైషి

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top