చంద్రబాబు, నారా లోకేశ్‌పై డీజీపీకి ఫిర్యాదు

YSRCP Leaders Complaint To DGP Goutam Sawang On Chandrababu And Lokesh - Sakshi

బాబు, లోకేశ్‌లపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలి

వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని కించపరుస్తున్నారు

టీడీపీ సోషల్‌ మీడియాలో దళితులను అవమానించేలా తప్పుడు పోస్టింగ్‌లు

డీజీపీ సవాంగ్‌కు వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యేల ఫిర్యాదు

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ల స్వీయ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న టీడీపీ అధికార ఫేస్‌బుక్‌ అక్కౌంట్‌లో తమపార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి  గురుమూర్తిని కించపరిచే పోస్టింగ్‌లు పెట్టారని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, కైలే అనిల్‌కుమార్‌.. డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం డీజీపీని కలిసిన ఎంపీ, ఎమ్మెల్యేలు.. టీడీపీ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టులను ఆధారాలతో సహా అందజేశారు.

టీడీపీ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టింగ్‌లో ‘ఒకప్పుడు జగన్‌రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన దగ్గర విధేయుడిగా ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి ఇప్పుడు పెద్దిరెడ్డి దగ్గర అంతే విధేయుడిగా ఉన్నాడని, ఎందుకంటే వైఎస్సార్‌సీపీలో దళితులకు ఎదిగే స్వేచ్ఛలేదు. అందుకే ఈసారి వినిపిద్దాం తిరుపతి గొంతు.. లోక్‌సభలో లక్ష్మి గొంతు’ అంటూ సీఎం వైఎస్‌ జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్లను గురుమూర్తి వత్తుతున్నట్టు ఫొటో సృష్టించి ఉంచారని తెలిపారు. ‘ఆంధ్రుల హక్కుల కోసం గళమెత్తువారు కావాలా? పెద్దిరెడ్డి కాళ్లకు మసాజు చేసేవారు కావాలా?’ అని పేర్కొంటూ పోస్టర్‌లో పనబాక లక్ష్మి ఫొటో పెట్టి టీడీపీకి ఓటు వేయండి అంటూ పోస్టులు పెట్టారని వివరించారు.

ఈ పోస్టింగ్‌ల ద్వారా గురుమూర్తిని ప్రజల దృష్టిలో బహిరంగంగా అవమానించి, మానసికంగా బాధించారని, గురుమూర్తి కులాన్ని, వ్యక్తిత్వాన్ని, వృత్తిని తీవ్రంగా కించపరిచినట్టు దళిత జాతి యావత్తు భావిస్తోందని తెలిపారు. సోషల్‌ మీడియాలో వాటిని ట్రోల్‌ చేస్తూ గురుమూర్తిని కించపరిచిన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని, టీడీపీ ఫేస్‌బుక్‌ అక్కౌంట్‌లో పెట్టిన తప్పుడు పోస్టింగ్‌లు తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు బాధ్యులైన చంద్రబాబు, లోకేశ్‌లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, ఐటీ యాక్ట్‌ కింద కేసు పెట్టి వారిని అరెస్టు చేయాలని కోరారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top