మాచర్ల స్కెచ్‌ చంద్రబాబుదే... 

YSRCP Leaders Comments On Chandrababu For Macherla Issue - Sakshi

పిన్నెల్లి సోదరుల అడ్డు తప్పించాలన్నదే బాబు ఉద్దేశం 

రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ప్రతిరూపమే మాచర్ల మారణకాండ 

హత్యా రాజకీయాలు చేసేందుకే బ్రహ్మారెడ్డికి ఇన్‌చార్జి పదవి  

మీడియాతో మంత్రి అంబటి, ఎమ్మెల్యేలు డాక్టర్‌ గోపిరెడ్డి, కాసు మహేష్‌ 

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు పరామర్శ 

నరసరావుపేట: పల్నాడు జిల్లా మాచర్లలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ విప్‌గా వ్యవహరిస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడిని హత్య చేసి.. అడ్డు తొలగించడం ద్వారా ఆ నియోజకవర్గంలో పాగా వేయాలని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కుట్ర పన్నారని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. అయితే ప్రజాబలం ఉన్న పిన్నెల్లిని బాబు వీసమెత్తు కూడా కదిలించలేరని స్పష్టంచేశారు.

శుక్రవారం రాత్రి మాచర్లలో జరిగిన ఘర్షణలో గాయపడి, నరసరావుపేట పట్టణంలోని జీబీఆర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీసీ వర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు మోహన్‌రావు, వీరయ్య, శ్రీనివాసరావులను శనివారం ఆయన ఎమ్మెల్యేలు డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్‌రెడ్డితో కలిసి పరామర్శించారు. వైద్యులను అడిగి వారి పరిస్థితి తెలుసుకున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, మరో ఇద్దరు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు.

అనంతరం మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ పిన్నెల్లి కుటుంబానికి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఏం చేయాలో తెలియక హత్యా రాజకీయాలకు తెరలేపారన్నారు. కొంతకాలంగా ‘కోపం రాదా తమ్ముళ్లూ మీకు..’ లాంటి చంద్రబాబు ఉపన్యాసాలు పరిశీలిస్తే అత­ను వారి నాయకులను రెచ్చగొడుతున్నారని స్పష్టంగా తెలుస్తోందని చెప్పా­రు. ఏడుగురి హత్య కేసులో నిందితుడైన బ్రహ్మారెడ్డిని టీడీపీ ఇన్‌చార్జిగా నియమించడం ద్వారా చంద్రబాబు, లోకేశ్‌లు మాచర్లలో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అందులో భాగమే ఈ సంఘటన అని, ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా పల్నాడులో చంద్రబాబు పాచికలు పారవని స్పష్టం చేశారు.  

రాళ్లు, కర్రలతో ఎందుకొచ్చారు? 
పిన్నెల్లి సోదరులను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని, వీటికి భయపడేది లేదని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇదేం ఖర్మ కార్యక్రమం చేపట్టిన టీడీపీ నేతలు, కార్యకర్తలు.. రాళ్లు, కర్రలు ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలని నిలదీశారు. ‘ఇరవై కేసులు లేకపోతే టీడీపీ నాయకులు కాలేరు’ అని చంద్రబాబు, లోకేశ్‌ చెప్పడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు డాక్టర్‌ గజ్జల బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top