సాక్షి, నరసాపురం: ఆక్వా సిండికేట్ చేతుల్లో కూటమి ప్రభుత్వం బందీ అయిపోయిందని, అప్సడాతో సంబంధం లేకుండా ఫీడ్ సిండికేట్ ధరలు పెంచేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడానికి కారణం కూడా సిండికేట్ ముఠాను నడిపించేది చంద్రబాబు బంధువుల కావడం వల్లనే అని పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఆరోపించారు.
నరసాపురం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే పెరిగిన విద్యుత్, డీజిల్ ధరలతో రైతులు అల్లాడిపోతుంటే కొత్తగా ఫీడు ధరలు పెంచి, 100 కౌంట్ రొయ్యల ధరలను ఏకంగా రూ.25 తగ్గిస్తే రైతులు బతికేదెలా అని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు ప్రతి ఎకరాకి సబ్సిడీ కరెంట్ ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు, రెండేళ్లలో ఒక్క సబ్సిడీ కనెక్సన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. 100 కౌంట్ రూ.250 పలుకుతుంటే, దానికి రైతుకి రూ.350 ఖర్చవుతోందని, చంద్రబాబు చర్యల కారణంగా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి దాపురించిందని మండిపడ్డారు.
సిండికేట్ ముఠాకి లబ్ధి చేకూర్చాలని ఉద్దేశపూర్వకంగానే మంత్రి అచ్చెన్నాయుడు అప్సడా సమావేశానికి డుమ్మా కొట్టాడని, మంత్రి ఆదేశాలను కూడా లెక్క చేయకుండా పెంచిన ధరలకే ఫీడు అమ్మకాలు సాగిస్తున్నారని స్పష్టం చేశారు. ఫీడు వ్యాపారులు డీలర్లకు అవసరమైన మేర ఫీడు ఇవ్వకుండా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఆక్వా రైతుపై ఒక్క రూపాయి భారం పడినా ఊరుకునేది లేదని, కాదని మొండిగా ముందుకెళితే రైతుల తరఫున వైఎస్సార్సీపీ ఉద్యమిస్తుందని మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు హెచ్చరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
అప్సడాతో సంబంధం లేకుండా ఎలా పెంచుతారు?:
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఫీడ్, సీడ్ ధరలు పెరిగిపోయి ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆక్వా సిండికేట్ చేతుల్లో ఈ ప్రభుత్వం బందీ అయిపోయింది. వారే ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఆక్వా రైతుల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గత ఫిబ్రవరిలోనే ఫీడు ధరలు టన్నుకు రూ.4 వేలు పెంచగా, ఇప్పుడు మళ్లీ మరో రూ.12 వేలు పెంచేశారు. ఫీడ్, సీడ్ రేట్లు పెంచాలన్నా, తగ్గించాలన్నా వైఎస్సార్సీపీ హయాంలో అప్సడా ద్వారానే జరిగేది. గత ఐదేళ్ల వైయస్సార్సీపీ పాలనలో అప్సడాలో రైతులు, ఎగుమతుదారులు, ప్రభుత్వం, పీడు యాజమాన్యం సభ్యులుగా ఉండి సమిష్టి నిర్ణయం తీసుకునేవారు. కానీ నేడు సిండికేట్ ముఠా అప్సడాతో సంబంధం లేకుండా ప్రభుత్వాన్నే తమ చెప్పుచేతల్లో పెట్టుకొంది. ఫీడు ధరల నియంత్రణపై ప్రభుత్వ అజమాయిషీ కరువైంది.
ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం సిండికేట్ ముఠాకి పెత్తనం అప్పగించేసింది. కాబట్టే నిన్న (శుక్రవారం) జరిగిన సమావేశానికి మంత్రి అచ్చెన్నాయుడు గైర్జాజరయ్యారు. ఫీడు ధరలను ప్రభుత్వం పెంచిందా, తగ్గించిందా తెలియని పరిస్థితి నెలకొంది. ఫీడ్ వ్యాపారులు మాత్రం పెంచిన ధరలకే అమ్మకాలు చేస్తున్నారు. సరిపోయినంత ఫీడు డీలర్లకు ఇవ్వకుండా కృతిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో పంట చేతికొచ్చే సమయంలో ఫీడు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
100 కౌంట్ ధర రూ.25 తగ్గించేశారు:
గత వైఎస్సార్సీపీ హయాంలో వైయస్సార్సీపీ హయాంలో రూ.3,800 కోట్ల మేర ఆక్వా రైతులకు సహకారం అందించడం జరిగింది. ఫీడు ధరలు మూడుసార్లు పెంచితే ప్రభుత్వం జోక్యం చేసుకుని తగ్గించడం జరిగింది. కానీ నేడు సీఎం చంద్రబాబు నుంచి కూటమి నాయకులు ఎవరూ రైతుల పక్షాన ఉండటం లేదు. ఫీడు వ్యాపారులే ఎగుమతుదారులుగా కూడా వ్యవహరిస్తూ మొన్నటి వరకు రూ.275 వరకు ఉన్న 100 కౌంట్ ధరను ఇప్పుడు ఏకంగా రూ.25 తగ్గించేశారు. రాబోయే రెండు మూడు రోజుల్లో మరో రూ.10 తగ్గిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
ఎక్స్‌పోర్టర్స్ మీటింగ్ పెట్టుకుంటే చాలు ధరలు తగ్గిపోతాయన్న భయం ఆక్వా రైతుల్లో కనిపిస్తోంది. ఒకపక్క ఫీడు ధరలు పెంచుతూ ఇంకోపక్క కౌంట్ ధరలు తగ్గిస్తూ ఆక్వా రైతుల పొట్టకొడుతున్నారు. గతంలో ఎప్పుడైనా ఫీడు ధరలు పెరిగితే వైయస్ జగన్ లంచాలు వెళ్లాయని ప్రచారం చేసేవారు. ఇప్పుడు లోకేష్ ఎంత లంచం తీసుకున్నాడో కూటమి నాయకులు చెప్పాలి. ఫీడు యాజమాన్యాలు చంద్రబాబుకి బంధువులు కాబట్టే వారి లబ్ధి కోసం రైతులను గాలికొదిలేశారు.
చంద్రబాబు బంధువులదే సిండికేట్ ముఠా:
ఆక్వా ఇండస్ట్రీస్‌కి సబ్సిడీ ధరకు కరెంట్ అందిస్తే రైతులకు మేలు జరుగుతుందని తెలిసినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మోడీతో మాట్లాడి ఫిష్ మీల్ ఇతర దేశాలకు ఎగుమతులు కాకుండా స్థానికంగా ఉపయోగపడేలా ఒప్పించాలి. అంతేకానీ రైతులు నిండా మునిగిపోతుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎక్స్‌పోర్టర్‌కి, సీడు, ఫీడు యాజమాన్యంపై భారం పడితే అంతిమంగా ఆ నష్టం ఆక్వా రైతు మీదే పడుతోంది.
సిండికేట్ నాయకులు చంద్రబాబుకి బంధువులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కాబట్టి వారికి కొమ్ముకాస్తూ వైయస్ జగన్ గారు ఆక్వా రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన అప్సడా చట్టానికి తిలోదకాలిస్తున్నారు. ముడి సరుకు ధరలు పెరిగినప్పుడు ఫీడు ధరలు పెంచుకుంటూ పోతున్నారు. కానీ సోయా ధర తగ్గినప్పుడు ఒక్కసారి కూడా ఫీడు ధరలు తగ్గించిన పాపానపోలేదు. మొత్తం మీద ఆక్వా సంక్షోభానికి సీఎం చంద్రబాబే కారణం అవుతున్నారు. అప్సడా ద్వారా వైయస్సార్సీపీ హయాంలో ఒక్క రూపాయి కూడా సీడు, ఫీడు ధరలు పెంచకుండా రైతులను ఆదుకోవడం జరిగింది.
కొత్తగా ఒక్క కనెక్షన్ కి సబ్సిడీ విద్యుత్ ఇవ్వలేదు:
వైఎస్సార్సీపీ హయాంలో 55 వేల కనెక్షన్లకు సబ్సిడీ ధరకు కరెంట్ ఇచ్చి ఆక్వా రైతులను ప్రోత్సహించడం జరిగింది. చంద్రబాబు మాత్రం ఎన్నికల సందర్భంగా ఆక్వా జోన్, నాన్ ఆక్వాజోన్‌తో సంబంధం లేకుండా అందరికీ సబ్సిడీ ధరకు కరెంట్ ఇస్తానని చెప్పి కొత్తగా ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదు. సిండికేట్ ముఠా ప్రభుత్వానికి తెలియకుండా ఫీడు ధరలు పది రూపాయలు పెంచింది. రేపు రూ.5 లు తగ్గించి, అది కూడా ఘనతగా ప్రభుత్వం ప్రచారం చేసుకోవాలని అనుకుంటోంది. అందుకే రొయ్యల రైతులను చిన్నచూపు చూస్తే ఊరుకునేది లేదని, రైతులపై ఒక్క రూపాయి భారం పడినా సహించబోమని, కాదని మొండిగా వ్యవహరిస్తే ఆక్వా రైతుల పక్షాన పార్టీ తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తామని ముదునూరి ప్రసాదరాజు హెచ్చరించారు.


