
- ఉప్పాల హారికపై దాడి ఘటనకు హోంమంత్రి సమాధానం చెప్పాలి
- అరాచక శక్తులను అదుపు చేసే బాధ్యత పోలీసులకు లేదా.?
- చంద్రబాబు, లోకేష్‌ల ప్రోత్సాహంతోనే దాడులు
- రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు
- ఒక బీసీ మహిళా ప్రజా ప్రతినిధిపై దాడి చేయడానికి సిగ్గుపడాలి
- మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం
గుంటూరు: కృష్ణాజిల్లా జెడ్పీ చైర్ పర్సన్, బీసీ నాయకురాలు ఉప్పాల హారికపై జరిగిన దాడి ఘటనకు హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్‌ల ప్రోత్సాహంతోనే టీడీపీ సైకోలు ఈ దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై కనీసం కేసు నమోదు చేసేందుకు కూడా పోలీసులు ముందుకు రావడం లేదన్నారు. రాష్ట్ర డీజీపీ పచ్చచొక్కా వేసుకుని ఏకపక్షంగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇంకా ఆయనేమన్నారంటే...
ఏడాది కాలంలో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన వైనంపై ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీ 'బాబు ష్యురిటీ-మోసం గ్యారెంటీ' పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. చంద్రబాబు మోసాలను ప్రశ్నించాలని ప్రజలను చైతన్యవంతం చేసేందుకు అన్ని జిల్లాల్లోనూ మొదటి దశలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. ప్రస్తుతం రెండో దశలో అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దీనిలో భాగంగా నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్య నేతల సమావేశాలు నిర్వహిస్తున్నాం.
ఇదే క్రమంలో గుడివాడ నియోజకవర్గంలో ఈ కార్యక్రమంపై సమావేశాన్ని నిర్వహించాం. అయితే ఈ సమావేశానికి రానివ్వకుండా కూటమి ప్రభుత్వం కుట్రలు చేసింది. కృష్ణాజిల్లా పార్టీ అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్యపై బందరు వదిలి రాకూడదంటూ నిర్బంధాలు అమలు చేశారు. బీసీ నాయకురాలు, కృష్ణాజిల్లా ప్రథమ పౌరురాలు ఉప్పాల హారిక గుడివాడకు చేరుకుంటే, ఆమె కారుపై తెలుగుదేశం, జనసేన గుండాలు రెచ్చిపోయి దాడులు చేశారు. కారు అద్దాలు పగులకొట్టారు, ఆమెపై దాడికి ప్రయత్నించారు. ఇది చూస్తుంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా, నియంతృత్వ పాలనలో ఉన్నామా అనే సందేహం కలుగుతోంది.
పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు
ఒక జిల్లా పరిషత్ చైర్మన్‌కే ఇటువంటి పరిస్థితి ఉంటే, ఇక సామాన్యులకు రక్షణ ఉంటుందా.? కర్రలు, రాళ్ళుతో టీడీపీ గూండాలు చేసిన దాడికి గంటసేపు అదే కారులో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఒక మహిళా నేత ఉండాల్సిన పరిస్థితికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. చివరికి ఆమె తెగించి, అక్కడే ప్రేక్షకపాత్ర పోషిస్తున్న పోలీసులను ఇదేనా మీరు చేస్తున్న శాంతిభద్రతల బాధ్యత అని ప్రశ్నిస్తే, దానికి సమాధానంగా పోలీసులు 'వారంతా తాగి వచ్చారు, అల్లరి చేస్తున్నారు, మేం మాత్రం ఏం చేస్తాం' అంటూ మాట్లాడటం చూస్తుంటే పోలీస్ వ్యవస్థ ఇంతగా పతనమైందా అనే అనుకోవాల్సి వస్తోంది.
పోలీసులు ఏం మాట్లాడారో మొత్తం సోషల్ మీడియాలో ఉన్న వీడియోలు చూస్తే ఎవరికైనా ఇదే భావం కలుగుతుంది. అసాంఘిక శక్తులను అదుపు చేసే సామర్థ్యం పోలీసులకు లేదా? దాడి చేస్తున్న గుండాలను అరెస్ట్ చేయరా? మద్యం, గంజాయి మత్తులో దాడులు చేస్తే, మౌనంగా పోలీసులు నిలబడిపోయారు. ఒక బీసీ మహిళపై పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతుంటే, రక్షణ కల్పించలేని అసమర్థతతో వ్యవస్థను నడుపుతున్నారా.? వైఎస్సార్‌సీపీపై పోలీసులను ప్రయోగించడం, మా కార్యకర్తలపై లాఠీలు ఝుళిపించడానికే పోలీసులను పరిమితం చేశారా? పెడనలో జరిగిన 'బాబు ష్యురిటీ-మోసం గ్యారెంటీ' కార్యక్రమానికి కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడుగా పేర్ని నాని వెళ్ళకూడదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు.
ఒక కళ్యాణ మంటపంలో నాలుగు గోడల మధ్య నడిచే మీటింగ్‌లకు కూడా ఆంక్షలు పెడతారా.? చంద్రబాబు, లోకేష్, హోంమంత్రిల ప్రోత్సాహంతోనే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారు. నెల్లూరులో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిమీద ఇలాగే దాడి చేశారు. ఇంత వరకు దోషులపై కేసు పెట్టలేదు. ఉప్పాల హారికపై దాడి చేసిన వారిపైనా ఇప్పటి వరకు కేసు పెట్టలేదు. వారిపై పోలీసులు కేసు పెడతామంటే మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనితలు అంగీకరించరు. డీజీపీ పచ్చ చొక్కా వేసుకున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలపై జరుగుతున్న ఇటువంటి దాడులపై కనీసం కేసులు కూడా పెట్టడం లేదు. ఏకపక్షంగా పనిచేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు అంబటి రాంబాబు.