బాబు చేతిలో తోలుబొమ్మలా నిమ్మగడ్డ

YSR Congress Party Leaders Comments On Chandrababu And Nimmagadda Ramesh - Sakshi

అమ్మ ఒడి పథకాన్ని అడ్డుకునేందుకు కుట్రలు  

ఎన్ని అడ్డంకులు సృష్టించినా అమ్మ ఒడి ఆగదు 

మంత్రులు అనిల్, గౌతమ్‌రెడ్డి, సురేష్‌ ధ్వజం 

నెల్లూరు (సెంట్రల్‌): లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూర్చే అమ్మ ఒడి పథకాన్ని అడ్డుకునేందుకు కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని రాష్ట్ర మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్‌ ధ్వజమెత్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్కుమార్‌ చంద్రబాబు చేతిలో కీలు»ొమ్మగా మారారని, సంక్షేమ పథకాలను నిలిపి వేసి రాక్షసానందం పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి న్యాయ వ్యవస్థను కూడా పరిగణనలోకి తీసుకోక పోవడం సిగ్గు చేటన్నారు.  ఎన్ని అడ్డంకులు సృష్టించినా అమ్మ ఒడి కార్యక్రమాన్ని నెల్లూరులో ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని స్పష్టం చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ‘జగనన్న అమ్మ ఒడి’ రెండో విడత కార్యక్రమం ప్రారంభించనున్న నేపథ్యంలో నెల్లూరులో మంత్రులు విలేకరులతో మాట్లాడారు.  

లబ్ధిదారులు పెరిగారు: మంత్రి సురేష్‌ 
గతేడాది కన్నా ఈ ఏడాది అమ్మ ఒడి పథకానికి అదనంగా 1.76 లక్షల మంది లబ్ధిదారులు పెరిగారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. ఈ అమ్మ ఒడి పథకం ద్వారా తల్లులకు ముందే సంక్రాంతి వచ్చిందన్నారు. చదువుకు పేదరికం అడ్డు కాకూడదని, బాలకార్మీకులుగా మారకూడదనే ఉద్దేశంతో అమ్మ ఒడి పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ నగదు జమ చేస్తున్నారన్నారు. విద్యావ్యవస్థలో ముఖ్యమంత్రి సమూల మార్పులు తీసుకువస్తున్నారని చెప్పారు. ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సిన ఉద్యోగులు ఇప్పుడు ఎన్నికలు వద్దని చెబుతున్నారని, వారికి నిమ్మగడ్డ రమేష్‌ ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు.  

సైంధవుడిలా చంద్రబాబు అడ్డుపడుతున్నారు: మంత్రి అనిల్‌ 
ప్రజా సంక్షేమానికి చంద్రబాబు సైంధవుడిలా అడ్డుపడుతున్నారని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. ప్రజలకు ఎంతో అవసరమైన అమ్మ ఒడి పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తుంటే దాన్ని కూడా అడ్డుకునే కుటిల రాజకీయాలు  చంద్రబాబు చేస్తున్నారన్నారు. మహిళలకు మేలు జరిగే సంక్షేమ పథకాలను అడ్డుకునే చంద్రబాబు మహిళా ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారన్నారు. ఒక పక్క వ్యాక్సిన్‌ పనిలో ప్రభుత్వ యంత్రాంగం ఉంటే, ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. కరోనాకు భయపడి హైదరాబాద్‌లో దాక్కున్న చంద్రబాబుకు, ఆయన కుమారుడికి ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? అని ప్రశ్నించారు.  

ప్రజలపై శ్రద్ధ ఉంటే ఎన్నికలపై ప్రశ్నించు: మంత్రి గౌతమ్‌రెడ్డి  
పరిశ్రమల వల్ల ప్రజల ఆరోగ్యానికి ఇబ్బందులు వస్తాయంటున్న పవన్‌ కళ్యాణ్, కరోనా సమయంలో ఎన్నికలు పెడుతున్న నిమ్మగడ్డను ఎందుకు ప్రశ్నించరని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ధ్వజమెత్తారు. దివీస్‌ పరిశ్రమల వద్ద పవన్‌ ఎందుకు ఆందోళన చేశారో ఆయనకే తెలిసినట్లు లేదన్నారు. దివీస్‌కు అనుమతి ఇచ్చిందే 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వమే అనేది తెలుసుకోవాలన్నారు. టీడీపీ పార్టనర్‌గా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ఈ సమావేశంలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఆప్కాబ్‌ చైర్మన్‌ అనిల్‌బాబు, విజయ డెయిరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top