ఉద్యోగాలు భర్తీ చేసే వరకు ఉద్యమం

YS Sharmila Comments At Pullemla Unemployment Strike - Sakshi

పుల్లెంల నిరుద్యోగ దీక్షలో వైఎస్‌ షర్మిల  

1.91 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్‌ ఇవ్వాలి 

చండూరు, మునుగోడు (నల్లగొండ): రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసేంతవరకు తాను ఉద్యమం కొనసాగిస్తానని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పష్టం చేశారు. ఏ ఒక్కరి బెదిరింపులకూ భయపడి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనని చెప్పారు. నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని పుల్లెంల గ్రామంలో మంగళవారం ఆమె నిరుద్యోగ దీక్ష చేశారు. ముందుగా దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సాయంత్రం 5.30 గంటలకు దీక్ష ముగిసిన తర్వాత షర్మిల మాట్లాడారు. 

కేసీఆర్‌ ఎవరికీ ఉద్యోగం ఇవ్వడం లేదు 
మాట తప్పని, మడమ తిప్పని దివంగత సీఎం వైఎస్సార్‌ బిడ్డనని, ఆయన ఆశయాలను తెలంగాణలో అమలు చేయడమే తన ప్రధాన లక్ష్యమని షర్మిల చెప్పారు. వైఎస్సార్‌ హయాంలో మూడుసార్లు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. 11 లక్షల మంది నిరుద్యోగులకు ప్రైవేటు ఉద్యోగాలు ఇచ్చారన్నారు. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ఏ ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వకుండా పూటకో మాట చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 91వేల ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వీటితో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల అదనంగా అవసరమైన మరో 3 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పటివరకు ప్రతి ఒక్క నిరుద్యోగికి నెలకు రూ.3,016 చొప్పున నిరుద్యోగ భృతి అందించాలన్నారు.  

శ్రీకాంత్‌ కుటుంబ సభ్యులకు పరామర్శ 
ఉన్నత విద్యను అభ్యసించినా ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న పుల్లెంల గ్రామానికి చెందిన పాక శ్రీకాంత్‌ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు.  

రాజగోపాల్‌రెడ్డి సంఘీభావం 
ఉద్యోగాలు రాక రాష్ట్రంలో యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సమయంలో.. నిరుద్యోగులకు అండగా దీక్ష చేపట్టడం మంచి నిర్ణయమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. దీక్షలో ఉన్న షర్మిలకు ఫోన్‌ చేసి ఆయన తన సంఘీభావం తెలియజేశారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top