యువ వైద్యులపై పోలీసులతో దాడులు చేయిస్తారా?: వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy Fires On Chandrababu Govt Over Police Attack On Young Doctors Incident, More Details Inside | Sakshi
Sakshi News home page

యువ వైద్యులపై పోలీసులతో దాడులు చేయిస్తారా?: వైఎస్‌ జగన్‌

Jul 3 2025 6:07 AM | Updated on Jul 3 2025 9:04 AM

YS Jagan Mohan Reddy Fires On Chandrababu Govt For Doctors Issues

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు వినతిపత్రం ఇస్తున్న యువ వైద్యులు

మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా?

వారి కెరీర్‌ను నాశనం చేయడం ఎంతవరకు సమంజసం

సీఎం చంద్రబాబును నిలదీసిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ‘విదేశాల్లో మెడికల్‌ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తారా? మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా?’ అని సీఎం చంద్రబాబును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. ఆ విద్యార్థుల కెరీర్‌ను నాశనం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసిన వారికి వెంటనే రిలీవింగ్‌ ఆర్డర్స్‌ ఇవ్వాలని.. ఎన్‌ఎంసీ మార్గదర్శకాల ప్రకారం ఎఫ్‌ఎంజీ పరీక్షల్లో ఉత్తీర్ణు్ణలైన వారికి వెంటనే పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. అందులో ఏమన్నారంటే..

మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా? 
‘చంద్రబాబూ.. మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా? విదేశాల్లో మెడికల్‌ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తారా? ఎన్‌ఎంసీ గైడ్‌లైన్స్‌ ప్రకారం వాళ్లంతా ఇక్కడ ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేషన్‌ (ఎఫ్‌ఎంజీ) ఎగ్జామ్‌లో ఉత్తీర్ణులైన తరువాత ఇక్కడే ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసినా, ఎందుకు పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఇవ్వడం లేదు? ఇది కేవలం ఒక ఫార్మాలిటీ అయినా.. ఇది ఇవ్వకుండా ఎందుకు వేధిస్తున్నారు? ఇదేనా మీ పరిపాలన? మీరు చేస్తున్న తప్పులను ఎత్తిచూపితే వారిపై పోలీసులతో దాడులు చేయిస్తారా? ఏడాది కాలంగా వారిపై వివక్ష చూపుతూ.. ఇంటర్న్‌షిప్‌ పేరుతో దీర్ఘ­కాలం వెట్టిచాకిరి చేయించుకుంటూ.. ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు లాభం చేకూర్చేలా.. ఉద్దేశ పూర్వకంగా వీరికి పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ (పీఆర్‌) నంబర్‌ ఇవ్వకపోవడం వాస్తవం కాదా? తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలని తల్లిదండ్రులు అప్పులు చేసి, ఆస్తులు అమ్మి తమ పిల్లలను విదేశాలకు పంపిస్తే.. ఆ పిల్లలు కష్టపడి చదువుకుని కోర్సులు పూర్తిచేశారు. అలాంటి వారిని అంటరాని వారిగా చూస్తూ వారి కెరీర్‌ను నాశనం చేయడం ఎంతవరకు సమంజసం? వారిని నిరుత్సాహ­పరచాలన్నది మీ ప్లాన్‌లో భాగం కాదా?.

విద్యార్థులపైనా ఇంత పగ ఎందుకు చంద్రబాబూ?
డాక్టర్లు కావాలనుకుంటున్న పిల్లలు విదేశాలకు వెళ్లి చదువుకునే ఇబ్బందుల్లేకుండా ఇక్కడే.. మన రాష్ట్రంలోనే.. ప్రభుత్వ రంగంలో 17 కాలేజీలను, వాటిద్వారా 2,550 సీట్లను తీసుకు వచ్చేలా మా ప్రభుత్వం పనులు చేసి, అందులో ఐదు కాలేజీలను ప్రారంభించింది. మిగి­లిన కాలేజీలను కూడా పూర్తిచేసే స్థాయికి తీసుకువెళ్తే..  చంద్రబాబు గారూ.. మీరు వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వం సీట్లు కేటాయిస్తే వాటిని వద్దు అన్న ప్రభుత్వం దేశ చరిత్రలో మీది మాత్రమే కాదా? మీ అవినీతి కోసం స్కామ్‌లు చేస్తూ ఆ కాలేజీలను ప్రైవేటీకరించే కుట్ర చేస్తున్నారు. 

పులివెందుల మెడికల్‌ కాలేజీకి ఎన్‌ఎంసీ కేటాయించిన సీట్లను కూడా వద్దు అంటూ లేఖరాసి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారు. ఇప్పుడు దేశంకాని దేశం వెళ్లి అక్కడ ఖర్చులు తగ్గించుకుని.. కష్టపడి కోర్సులు పూర్తిచేసి వస్తే వారికి పీఆర్‌ నంబర్‌ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతు­న్నారు. పైగా అడిగితే పోలీస్‌ స్టేషన్‌లో వేశారు. తల్లిదండ్రులపైనా, విద్యార్థులపైనా ఇంత పగ ఎందుకు చంద్ర­బాబూ? ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసిన వారికి వెంటనే రిలీవింగ్‌ ఆర్డర్స్‌ ఇవ్వాలని, ఎన్‌ఎంసీ గైడ్‌లైన్స్‌ ప్రకారం ఎఫ్‌ఎంజీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వీరికి వెంటనే పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఇవ్వాలని డిమాండ్‌  చేస్తున్నాను’ అని వైఎస్‌ జగన్‌ తన పోస్టులో పేర్కొన్నారు.

వైఎస్‌ జగన్‌కు గోడు వెళ్లబోసుకున్న యువ వైద్యులు
విదేశాల్లో మెడికల్‌ కోర్సులు పూర్తిచేసుకున్న యువ వైద్యులు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కూటమి ప్రభుత్వం పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ ఇవ్వకపోవడంతో తామంతా విజయవాడలోని వైద్య విశ్వవిద్యాలయానికి మంగళవారం వెళ్లామన్నారు. అక్కడ నిరసన వ్యక్తం చేస్తుండగా.. పోలీసులు తమపై దాడి చేశారని యువ వైద్యులు వైఎస్‌ జగన్‌కు వివరించారు. 

ఇక్కడ మెడికల్‌ సీట్లు రాకపోవడంతో తమ తల్లిదండ్రులు ఎన్నో కష్టనష్టాలకోర్చి, అప్పులు చేసి మరీ తమను విదేశాలకు పంపించారని చెప్పారు. తాము కష్టపడి మెడికల్‌ కోర్సులు పూర్తిచేశామని, ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం ఎఫ్‌ఎంజీ పరీక్ష, ఇంటర్న్‌షిప్‌ చేసినా తమకు పర్మినెంట్‌ నంబర్‌ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్‌ఎంజీ చేసిన మరికొంతమంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ ఇవ్వడం లేదని, గడువుకు మించి ఇంటర్న్‌షిప్‌ పేరిట గొడ్డుచాకిరీ చేయించుకున్నారని యువ వైద్యులు వైఎస్‌ జగన్‌కు వివరించారు. యువ వైద్యుల వెంట వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఏ.రవిచంద్ర ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement