
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు
రాష్ట్రంలో ఏ పంటకైనా కనీస మద్దతు ధర ఉందా?
రైతులు రోడ్డెక్కడం చంద్రబాబు సహా కూటమి నేతలకు పట్టదా?
మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్న కనీస బాధ్యత లేదా?
మీరు, మీ మంత్రులు, యంత్రాంగానికి ఇది ధర్మమేనా?.. మిర్చి రైతులను నమ్మించి మోసం చేశారు
మా హయాంలో ధరల స్థిరీకరణ కోసం రూ.3 వేల కోట్లతో ప్రత్యేక నిధి
ఐదేళ్లలో ఏకంగా రూ.7,796 కోట్లు ఖర్చు చేసి ఆదుకున్నాం
మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది
మద్దతు ధర లేని పంటలను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు కనీస మద్దతు ధర లభించక రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా, టీడీపీ కూటమి ప్రభుత్వంలో పట్టించుకునే వారు కరువయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఒక్క ఎకరాకు సంబంధించి ఒక్క క్వింటాల్ కూడా కొనకుండా అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3 వేల కోట్లు పెట్టి, ఐదేళ్లలో రికార్డు స్థాయిలో మార్కెట్‌లో ధర లేని పంట ఉత్పత్తుల సేకరణ ద్వారా రైతులను ఆదుకునేందుకు మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ కింద రూ.7,796 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.
చరిత్రాత్మక నిర్ణయాలతో కనీస మద్దతు ధరల జాబితాలో లేని పొగాకు సహా అనేక పంటల రైతులను ఆదుకున్నామని గుర్తు చేశారు. ‘మీరు కొత్తగా ఏమీ చేయకపోయినా, కనీసం మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది కదా?’ అని ప్రశ్నిచారు. రాష్ట్రంలో రైతుల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ‘ఎక్స్’ వేదికగా శనివారం ఆయన ఎండగట్టారు. ఆ పోస్ట్‌లో ఇంకా ఏమన్నారంటే..

కనీస బాధ్యతను విస్మరించారు
⇒ చంద్రబాబు గారూ.. కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులు కూడా రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. మీరు, మీ మంత్రులు, యంత్రాంగం వారి వైపు కన్నెత్తి కూడా చూడక పోవడం ధర్మమేనా?

⇒ మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశనగ, టమాటా, అరటి, చీని, పొగాకు ఇలా ఏ పంట చూసినా కనీస మద్దతు ధర రావడం లేదు. చొరవ చూపి, మార్కెట్‌లో జోక్యం చేసుకోవాలన్న కనీస బాధ్యతను విస్మరించారు. పైగా డ్రామాలతో రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇది న్యాయమేనా?
⇒ మిర్చి విషయంలో కూడా మీరు రైతులను నమ్మించి మోసం చేశారు. మిర్చి కొనుగోలు అంశం కేంద్రం పరిధిలో లేకపోయినా, నాఫెడ్ కొనుగోలు చేస్తుందని మొదట నమ్మబలికారు. క్వింటాకు రూ.11,781కు కొంటామని చెప్పి, ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టకుండా, ఒక్క రైతు నుంచి కానీ, ఒక్క ఎకరాకు సంబంధించి కానీ, ఒక్క క్వింటాల్ గానీ కొనకుండా అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారు. ఇది వాస్తవం కాదా?
⇒ మా హయాంలో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3 వేల కోట్లు పెట్టి, ఐదేళ్లలో రూ.7,796 కోట్లు ఖర్చు చేశాం. చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని కనీస మద్దతు ధరల జాబితాలో లేని పొగాకు సహా అనేక పంటల రైతులను ఆదుకున్నాం. మీరు కొత్తగా ఏమీ చేయకపోయినా, కనీసం మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది కదా? పైగా ఈ ఏడాది బడ్జెట్లో కేవలం రూ.300 కోట్లు కేటాయించడం దారుణం కాదా? ఇందులో కూడా కనీసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా?
⇒ ధాన్యం, కోకో, పొగాకు, ఆక్వా రైతులు ఆయా జిల్లాల్లో ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారు. జనాభాలో 60 శాతం మంది ప్రజలు ఆధారపడే వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అది తీవ్ర సంక్షోభానికి దారితీస్తే, లక్షల మంది ఉపాధికి గండి పడితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? వెంటనే ప్రభుత్వం తరఫున మార్కెట్లో జోక్యం చేసుకోవాలి. కనీస మద్దతు ధరలు లభించని పంటల విషయంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని, మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి.