CM Yediyurappa Resign: ముగియనున్న రాజకీయ కురు వృద్ధుడి శకం?

Yediyurappa likely Resign For CM Post On July 25th - Sakshi

బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు కొన్ని రోజులుగా హాట్‌హాట్‌గా ఉన్నాయి. ముఖ్యమంత్రిగా బీఎస్‌ యడియూరప్పను బీజేపీ నాయకులు అంగీకరించడం లేదు. కొన్ని నెలలుగా ఆయనను పదవీచ్యుతుడిగా చేయాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ రెండు వర్గాలుగా ఏర్పడింది. అయితే ఇందులో యడియూరప్ప వ్యతిరేక వర్గం బలంగా ఉంది. యడియూరప్పను సీఎం పదవి నుంచి దింపేయాలని పలుసార్లు ఢిల్లీకి వెళ్లి బీజేపీ అధిష్టానానికి విన్నవించారు.

ఇక కర్ణాటకలో బాహాటంగానే మంత్రులు, ఎమ్మెల్యేలు యడియూరప్పకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ క్రమంలోనే ఇక యడియూరప్పను సాగనంపాలనే నిర్ణయానికి బీజేపీ అధిష్టానం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ వర్గాలు కర్ణాటక నాయకులకు సంకేతాలు కూడా ఇచ్చినట్లు సమాచారం. మూడు రోజుల్లో అంటే ఈనెల 25వ తేదీనే యడియూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు అధికారికంగా వెల్లడవుతున్న సమాచారం. (చదవండి: రాజీనామాకు సీఎం సిద్ధం.. చివరిసారి అందరికీ విందు)

యడ్డి స్థానంలో పార్టీలోని సీనియర్‌ నాయకుడిని అధిష్టానం ప్రకటించనుందట. ఈ సందర్భంగా తనపై వస్తున్న వార్తలపై యడియూరప్ప స్పందించారు. అధిష్టానం ఆదేశాలు శిరసావహిస్తానని ప్రకటించారు. సీఎం పదవికి ఎవరిని సూచించినా తాను అంగీకరిస్తానని స్పష్టం చేశారు. 78 ఏళ్ల యడియూరప్ప ముఖ్యమంత్రి పదవి చేపట్టి రెండేళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా జూలై 26వ తేదీన ఓ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకోగా అవన్నీ రద్దయ్యాయి. అధిష్టానం ఆదేశాల మేరకు యడ్డి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. కొత్త ముఖ్యమంత్రిగా మురుగేష్‌ నిరానీ, బసవరాజ్‌ ఎస్‌.బొమ్మై, ఆర్‌.అశోక్, సి.ఎన్‌.అశ్వత్థ నారాయణ్, జగదీష్‌ షెట్టర్‌(మాజీ సీఎం), ఎమ్మెల్యే అరవింద్‌ బెల్లాద్‌ నియమితులవుతారని వార్తలు వినిపిస్తున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top