పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి ఆధిక్యంలో దూసుకెళ్తోంది. 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్డీయే కూటమి 200 పైచిలుకు స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శించగా.. ప్రతిపక్ష మహాఘఠ్ బంధన్ 32 స్థానాలకే పరిమితమైంది. ఈ క్రమంలో తదుపురి బిహార్ సీఎం ఎవరు? అనే అంశంపై ఉత్కంఠ నెలకొనగా.. నితీశ్ కుమారే 10వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అందురూ అనుకున్నారు.
ఈ క్రమంలో అనూహ్యం బిహార్ సీఎం నితీశ్ కాదనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. శుక్రవారం బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమిదే విజయం అంటూ అంబరాన్నింటిన సంబరాల వేళ.. నీతీశ్ ప్రభుత్వం రాబోతోందని, అందుకు బిహార్ సిద్ధంగా ఉందంటూ జేడీయూ వరుస పోస్టులు పెట్టింది. ఈ విజయం అపూర్వమైనది. సాటిలేనిది. నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనే సీఎంగా కొనసాగుతారు అని జేడీ(యు) శుక్రవారం ట్వీట్ చేసింది. అయితే, కొన్ని నిమిషాల తర్వాత ఆ పోస్ట్‌ను తొలగించింది. దీంతో బిహార్ సీఎం ఎవరు? అనే అంశంపై ప్రతిష్టంభన నెలకొంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అనూహ్య విజయం తర్వాత నితీశ్ కుమార్ భవిష్యత్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికలకు ముందు, నితీష్ నాయకత్వంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు బీజేపీ స్పష్టం చేసినప్పటికీ రికార్డు స్థాయిలో 10వ సారి అధికారంలోకి రావాలని చూస్తున్న జేడీ(యు)అధినేత నితీషే సీఎం పదవిని అధిష్టిస్తారని అధికారికంగా ప్రకటించలేదు. దీంతో బిహార్ సీఎం పోస్టుపై ఉత్కంఠ కొనసాగుతోంది.
బీహార్ ముఖ్యమంత్రి ఎవరు?
మరోవైపు మహారాష్ట్ర తరహా పాలిటిక్స్‌ను బిహార్‌లో అప్లయి చేయాలని కమలం పెద్దలు చూస్తున్నట్లు రాజకీయ నిపుణులు అభిపప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2024 మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో శివసేనకు చెందిన ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఎన్నికలకు వెళ్లగా.. కాషాయ పార్టీ ఆధిపత్య ప్రదర్శన తర్వాత ఆ పదవి చివరికి దేవేంద్ర ఫడ్నవీస్‌కు కట్టబెట్టింది. అదే విధంగా ఇక్కడ (బీహార్) ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న సామ్రాట్ చౌదరికి సీఎం పగ్గాలు అప్పగించే యోచనలో ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జేడీయూ సోషల్ మీడియా పోస్టులు డిలీట్ చేసిన తర్వాత బిహార్ సీఎంగా సామ్రాట్ ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రచారమూ జరుగుతోంది. మరి ప్రచారంలో వాస్తవమెంత? బిహార్ సీఎంగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారు? అనే అంశంపై బిహార్ ఎన్డీయే కూటమి పెద్దలు అధికారిక ప్రకటన ఇచ్చే వరకు ఎదురు చూడాల్సి ఉంది.

విశ్వసనీయత కోల్పోయిన నితీశ్
గెలుపు,ఆధిక్యం పక్కనబెడితే..నితీశ్ కుమార్ మరోసారి సీఎం అయ్యే అవకాశం లేకపోవచ్చనే వాదన సైతం వినిపిస్తోంది. తరచూ మారుతున్న రాజకీయ కూటముల కారణంగా నితీశ్ ప్రజా విశ్వసనీయతను కోల్పోవడంతో పాటు ఇతరాత్ర కారణాలున్నా మాట సర్వత్రా వినిపిస్తోంది.
‘అధికార దాహం’ ఉన్న నేతగా
గత దశాబ్ద కాలంలో ఆయన పలుమార్లు బీజేపీతో, ఆ తర్వాత ఆర్జేడీతో జతకట్టి, తిరిగి బీజేపీ గూటికి చేరడంతో ఆయనపై ప్రజల్లో ఒక రకమైన తేలికభావం ఏర్పడింది. ఒకప్పుడు ‘సుపరిపాలన బాబు’గా గుర్తింపు పొందిన నితీశ్ ఇప్పుడు కేవలం ‘అధికార దాహం’ ఉన్న నేతగా ముద్రపడ్డారు. పదే పదే పార్టీలు మారే నితీష్ వైఖరి ఆయన సొంత పార్టీ జేడీయూ (జేడీయూ)బలాన్ని సైతం గణనీయంగా తగ్గించింది, ఫలితంగా నితీష్ తన సొంత శక్తిపై మరోమారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించే అవకాశం లేకుండా పోయింది.
కేంద్ర రాజకీయాల్లోకి నితీశ్
ప్రస్తుతం దేశంలోని రాజకీయ సమీకరణాలలో ప్రధాని మోదీ సారధ్యంలోని బీజేపీ వ్యూహం అత్యంత కీలకమైనది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచేందుకు.. ప్రతిపక్షాల ఐక్యతా వేదిక ఇండియా కూటమిని బలహీనపరిచేందుకు.. బీజేపీ సీఎం నితీశ్‌ను ఒక ఉపకరణంగా మాత్రమే వాడుకుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. బిహార్‌లో తమకు నమ్మకమైన మెజారిటీని సాధించిన తర్వాత, నితీశ్ నాయకత్వాన్ని కొనసాగించడం కంటే,రాష్ట్రంలో బీజేపీ బలం కలిగిన నేతను తెరపైకి తేవాలని, లేదా నితీశ్‌కు గౌరవప్రదమైన పదవి ఇచ్చి, కేంద్ర రాజకీయాలకు పంపాలని బీజేపీ భావించి ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
మరోవైపు బీహార్ రాజకీయాల్లో యువ నాయకత్వం దూసుకొస్తోంది. ప్రతిపక్షంలో ఉన్న తేజస్వి యాదవ్ (ఆర్జేడీ) వంటి యువ నాయకులు తమ బలాన్ని పెంచుకుంటూ, ప్రజల్లో ఆశలను పెంచుతున్నారు. ముఖ్యంగా నితీశ్ కుమార్ పాలనలో సరైన ఉద్యోగ అవకాశాలు లభించలేదనే భావన యువతలో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్ స్థానంలో మార్పును కోరుకునే ఓటర్ల సంఖ్య పెరిగిందనేవారూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ యువ నాయకత్వ ఆకర్షణ నితీశ్ రాజకీయ జీవితానికి పెద్ద సవాలుగా మారనుంది.
ముగింపు దశకు నితీశ్ కుమార్ శకం
నితీశ్ కుమార్ తిరిగి బీజేపీతో చేతులు కలపడం అనేది ఆయన ముఖ్యమంత్రి పదవీ కాలంపై మరింత అనిశ్చితిని పెంచింది. ప్రస్తుతం బీజేపీ మద్దతుపై ఆధారపడిన నితీశ్ , గత లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ షరతులకు లోబడి ఉండవలసి వచ్చింది. ప్రస్తుత ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తే, నితీశ్‌ను పక్కన పెట్టి, తమ సొంత ముఖ్యమంత్రిని ప్రకటించడానికి బీజేపీ ప్లాన్ చేసివుండవచ్చనేవారూ ఉన్నారు. అంతేకాకుండా, అనారోగ్య కారణాలు లేదా వయోభారం వంటి వ్యక్తిగత కారణాలను చూపుతూ బీజేపీ.. నితీష్‌ను స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసేలా ప్రోత్సహించే అవకాశం కూడా ఉంది. ఈ కారణాలన్నింటినీ కలిపి చూస్తే, బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ శకం ముగింపు దశకు చేరుకుందని, భవిష్యత్తులో ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కాకపోవచ్చనే అంచనాలున్నాయి.


