ఖమ్మం రాజకీయాల్లో ఏం జరుగుతోంది! సై అంటే సై! స్పీడ్‌ పెంచిన తుమ్మల, మట్టా, మదన్‌లాల్‌

Vyara Sathupalli Paleru Constituency Local Leaders Politics Khammam District - Sakshi

మూడు నియోజకవర్గాల్లో దూకుడు పెంచిన ఆశావహులు 

ఈ నియోజకవర్గాల్లో గులాబీ శ్రేణుల మధ్య వార్‌

తమకే టికెట్‌ అనే ధీమాలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు

సాక్షిప్రతినిధి, ఖమ్మం : వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీఆర్‌ఎస్‌లో ఆశావహ నేతలు దూకుడు పెంచారు. ప్రధానంగా ఆ పార్టీలో పాలేరు, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఆశావహ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వారి అనుచరగణమూ ఇదే స్థాయిలో సై అంటే సై అంటోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, అశావహ నేతలు నువ్వా.. నేనా అన్నట్టుగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మళ్లీ తమకే పార్టీ టికెటన్న ధీమాలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉండగా.. పార్టీ సర్వేల్లో జాతకాలు మారుతాయన్న నమ్మకంతో ఆశావహులు ఉన్నారు. ఇటీవల ఆశావహ నేతలు హాట్‌హాట్‌గా ప్రకటనలు చేస్తూ తమ అనుచరులను క్రియాశీలకం చేసే పనిలో నిమగ్నమయ్యారు. 
(చదవండి: Munugode Bypoll: పోటీయా? మద్దతా?)

పాలేరులో పోటా పోటీ..
పాలేరు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ కేడర్‌ రెండుగా చీలింది. గత కొంతకాలంగా రెండు వర్గా ల మధ్య ఉప్పు–నిప్పు అన్నట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులు పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలు, నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు కందాల హాజరవుతున్నారు. ఈ జోష్‌తో తన అనుచర నేతలు, కేడర్‌తో మళ్లీ పోటీలో ఉండేది తానేనంటూ సంకేతాలిస్తున్నారు.

నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్‌ సెంటర్లు పెట్టడంతో పాటు గతంతో పోలిస్తే గ్రామ పర్యటనలకు ఇటీవల ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక తన అనుచర నేతలు, కేడర్‌ నుంచి ఏ కార్యక్రమానికి పిలుపు వచ్చినా తుమ్మల వదులుకోవడం లేదు. వీటిల్లో పాల్గొంటూనే రాజకీయంగా చర్చనీయాంశం అయ్యేలా ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇటీవల నేలకొండపల్లి మండలంలో ఆయన పర్యటిస్తూ ‘ఎప్పుడైనా పిడుగులు పడొచ్చు’ అంటూ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. త్వరలో ఎన్నికలు వస్తాయని, టికెట్‌ తనకేనన్న నమ్మకంతో తుమ్మల ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆయన అనుచర వర్గం చర్చించుకుంటోంది.  

వైరా ‘గులాబీ’లో వార్‌..
జిల్లా కేంద్రానికి సమీపాన ఉన్న వైరా నియోజకవర్గ ‘గులాబీ’లో వార్‌ కొనసాగుతోంది. ఇండిపెండెంట్‌గా గెలిచి ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ గూటికి చేరిన ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ తమకే టికెట్‌ అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఈ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే బానోత్‌  చంద్రావతి కూడా టికెట్‌ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

పార్టీ పరంగా ఏ కార్యక్రమం ఉన్నా ముఖ్యంగా ఎమ్మెల్యే రాములునాయక్, మదన్‌లాల్‌ వర్గాలు వేర్వేరుగా చేస్తుండడం గమనార్హం. అంతేగాకుండా ఇరువురూ తమ కేడర్, నేతలతో భారీగా ర్యాలీలు నిర్వహిస్తూ బలప్రదర్శన చేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తమకంటూ ఒక టీం ఏర్పాటు చేసుకుని ఎక్కడా తగ్గకుండా కార్యక్రమాలు చేపడుతుండడంతో రోజురోజుకూ రాజకీయం వేడెక్కుతోంది. ఈ ముగ్గురితోపాటు మరో ఒకరిద్దరు కూడా ఈ నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్‌ ఆశిస్తుండడంతో చివరికి పోటీలో ఎవరు ఉంటారన్నది సర్వేల్లో తేలుతుందన్నది పార్టీ వర్గాల సమాచారం. 

సత్తుపల్లిలోనూ ఇదే సీన్‌..
ఉమ్మడి జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసే నేతలకు పుట్టినిల్లు సత్తుపల్లి నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి చెందిన ప్రధాన నేతల ఆశీస్సులు ఎవరికి ఉంటే వారిదే గెలుపన్నది ఎప్పటినుంచో సాగుతున్న ప్రచారం. ఇటీవల ఏ ఎన్నికలు వచ్చినా.. మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు ఆశీర్వాదం ఎవరికి ఉంది.. దీంతో బరిలో ఉండే అభ్యర్థుల బలాబలాలు ఎలా ఉంటాయన్నది అంచనా వేయడం పరిపాటిగా మారింది. అయితే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టికెట్‌ తనకే వస్తుందన్న ధీమాతో నాలుగోసారి విజయం కోసం ఎదురుచూస్తున్నారు.

2009, 2014, 2018 లో టీడీపీ నుంచి సండ్ర గెలుపొందారు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. సీనియర్‌ ఎమ్మెల్యే కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీస్సులు కూడా సండ్రకే ఉంటాయని ఆయన అనుచర వర్గం చర్చించుకుంటోంది. మరోవైపు గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఆశించి భంగపడిన డాక్టర్‌ మట్టా దయానంద్‌ ఈసారి వేగం పెంచారు. తన వర్గం కేడర్‌తో కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు. నాలుగో సారి విజయం తనదేనంటూ సండ్ర, తనకు టికెట్‌ వస్తుందన్న ధీమాలో దయానంద్‌ ఉండడంతో ఈ నియోజవర్గంలో గులాబీ రాజకీయం రసవత్తరంగా మారింది.
(చదవండి: డిగ్రీ విద్యార్హతగల వీఆర్‌ఏలకు పేస్కేల్‌! రెవెన్యూలోనే కొనసాగింపు? )

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top