
రామగుండం ఎత్తిపోతలను ప్రారంభిస్తున్న మంత్రులు ఉత్తమ్, తుమ్మల, శ్రీధర్‌బాబు, పొన్నం, అడ్లూరి
ఏపీ ప్రతిపాదిత బనకచర్లను వ్యతిరేకిస్తున్నాం
మా ఫిర్యాదుతోనే కేంద్రం ఆ ప్రాజెక్టును తిరస్కరించింది
గోదావరిలో 968 టీఎంసీల వాటా వాడుకొనేలా ప్రాజెక్టులు కడతాం
రామగుండం ఎత్తిపోతల ప్రారంభోత్సవంలో మంత్రి ఉత్తమ్
సాక్షి పెద్దపల్లి: ‘నారా లోకేశ్ సహా ఏపీ మంత్రుల మాటలు పట్టించుకోం. ఏపీ ప్రతిపాదిత బనకచర్ల ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అది తెలంగాణ నీటిహక్కుల ఉల్లంఘనే అవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి, నేను పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. మా ఫిర్యాదుతోనే బనకచర్లను కేంద్ర జలసంఘం తిరస్కరించింది.
ఏపీ సీఎంతో జరిగిన సమావేశంలోనూ మేం బనకచర్లను వ్యతిరేకించాం’అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడ వద్ద రామగుండం ఎత్తిపోతల పథకాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుదిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఉత్తమ్ ఆదివారం ప్రారంభించారు.
అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ఏపీ మంత్రుల మాటలను పట్టుకొని బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతున్నారని విమర్శించారు. గోదావరి జలాలను రాయలసీమకు తీసుకువెళ్తానని కేసీఆర్ గతంలో అన్నారని ఆయన గుర్తుచేశారు. గోదావరిలో రాష్ట్రానికి ఉన్న 968 టీఎంసీల నీటి వాటాను సంపూర్ణంగా వినియోగించుకునెలా ప్రాజెక్టులు నిర్మిస్తామని తెలిపారు.
తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని పునఃప్రారంభిస్తాం..
గత ప్రభుత్వం దోపిడీ కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డలో నీరు నిల్వ చేస్తే దిగువన ఉన్న 44 ఊళ్లు, భద్రాచలం వరదలో కొట్టుకుపోతాయని జాతీయ డ్యామ్‌ల భద్రత ప్రాధికార సంస్థ నివేదిక అందించిందని చెప్పారు.
అందుకే మూడు బ్యారేజీల మరమ్మతులకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రూ. 38 వేల కోట్లతో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. కాళేశ్వరం ఉపయోగంలో లేకపోయినా రికార్డుస్థాయిలో వరి పండిందని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై జస్టిస్ ఘోష్ కమిషన్ అందించిన నివేదికను కేబినెట్ ముందు పెడతామని.. దీనిపై అసెంబ్లీ చర్చిస్తామని మంత్రి వెల్లడించారు.
తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణాన్ని పునఃప్రారంభిస్తామన్నారు. ఇచ్చంపల్లి వద్ద కూడా మరో ప్రాజెక్టు నిర్మిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం, పెద్దపల్లి ఎమ్మెల్యేలు మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, విజయ రమణారావు తదితరులు పాల్గొన్నారు.